
రహస్య లేఖతో మెరుగుపడ్డ భారత్ – చైనా సంబంధాలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల కొరడా ఝళిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్–చైనాల సంబంధాలను మలుపుతిప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓ లేఖ రాశారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే ఆకాంక్షను ఆయన అందులో వ్యక్తం చేశారు. లేఖను రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి అందజేశారు. భారత్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తమకు ఈ విషయం తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ తాజా కథనంలో పేర్కొంది. అమెరికాతో కుదుర్చుకున్న ఎలాంటి ఒప్పందమైనా అది అంతిమంగా చైనా ప్రయోజనాలకు హానికల్గిస్తుందని జిన్‌పింగ్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.
ద్రౌపదీ ముర్ముకు మార్చిలో జిన్‌పింగ్ ఒక లేఖ రాసినట్లు రెండు దేశాల మీడియాల్లోనూ వచి్చంది. అయితే, ఆ లేఖ ఇదేనా అనే విషయం స్పష్టం కాలేదు. అనంతర పరిణామాల్లో రెండు దేశాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు పలు చర్యలను ప్రకటించాయి. కైలాస్–మానస సరోవర్ యాత్ర మార్గాన్ని భారత తీర్థయాత్రికుల కోసం చైనా తెరవగా చైనా పర్యాటకుల కోసం భారత్ వీసాల జారీని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు సైతం మొదలయ్యాయి. మార్చిలో జిన్‌పింగ్ రాసిన లేఖ తర్వాత, ట్రంప్ టారిఫ్‌ల బాదుడు మొదలుకాక మునుపే భారత్, చైనాల మధ్య దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు మొదలైనట్లు బ్లూమ్‌బర్గ్ కథనం విశ్లేషించింది. మరోవైపు, ట్రంప్ టారిఫ్‌ల విధానం అమెరికా–భారత్ మధ్య అంతరాన్ని పెంచింది.
దీనికితోడు భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరగాల్సిన అణుయుద్ధం తన జోక్యంతోనే ఆగిందంటూ ట్రంప్ పదేపదే చెప్పుకోవడాన్ని భారత్‌కు అస్సలు రుచించలేదు. అప్పటి వరకు చైనాకు దగ్గరయ్యే విషయాన్ని అంత సీరియస్‌గా ఆలోచించని భారత్ జూన్ తర్వాతే చైనాతో సంబంధాల మెరుగుపై దృష్టిపెట్టిందని బ్లూమ్‌బర్గ్ కథనం విశ్లేషించింది. గతేడాది లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి రావడం కూడా చైనాపై సానుకూలంగా ఆలోచించేందుకు దారి చూపిందని తెలిపింది.
ఇదే త్వరలో చైనాలో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్రం సందర్భంగా జిన్‌పింగ్, మోదీల ముఖాముఖీకి మార్గ సుగమం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ కంటే ముందుగా చైనాపైనే ట్రంప్ 145 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. అయితే, ఆ దేశంతో అమెరికా వైఖరి మరోలా ఉంది. టారిఫ్‌లకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా ప్రస్తుతం ఆ దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. కీలక ఖనిజాల సరఫరా వంటివి చైనా చేతుల్లో ఉండటంతో ట్రంప్ ఆ దేశంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు.