పూణె: ప్రతిమనిషికి ఏదో ఒకరోజు మృత్యువు సంభవిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. కొందరికి ఎవరూ ఊహించని విధంగా మృత్యువు వాటిల్లుతుంది. ఇటువంటి ఘటనే అత్యంత ఖరీదైన కారులో విలాసవంతగా వెళుతున్న మహిళకు ఎదురయ్యింది. పూణే నుండి మాంగావ్‌కు వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారులో వెళుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా మృత్యువాత పడింది.
కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి ఆమె వెళుతున్న కారుపై పడి, అది కారు సన్‌రూఫ్‌ను చీల్చుకొని, అమాంతం కారులోని ఆమెపై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని గుజరాత్‌కు చెందిన స్నేహల్(43)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని తమ్హిని ఘాట్‌లో చోటుచేసుకుంది.
మరో ఘటనలో ముంబై నుండి జల్నాకు వెళుతున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన హైవేలోని నాగ్‌పూర్ లేన్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకునితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి, వారి ప్రాణాలను కాపాడాడు. ఇదేవిధంగా అక్టోబర్ 18న మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో వేగంగా వస్తున్న మినీ ట్రక్కు లోయలో పడటంతో ఎనిమిది మంది మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు


