
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): బీడీసీసీ బ్యాంకు ఎన్నికల పేరుతో తన భర్త మంత్రి సతీష్ జార్కిహొళి అనుచరులతో కలిసి వారంపాటు ఇంటికి రాకుండా, ఫోన్ చెయ్యకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ భర్త కనిపించగానే దాడి చేసింది. ఈ విచిత్ర సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా మదిహళ్లి గ్రామంలో జరిగింది. బెళగావి బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అభ్యర్థులు ఓటర్లు జారిపోకుండా శిబిరాలకు తరలించాయి.
పీకేపీఎస్ సభ్యుల్లో ఒకడైన మారుతి అనే వ్యక్తి వారం రోజుల నుంచి కనబడకుండాపోయాడు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా జార్కిహొళి సభకు హాజరయ్యాడు, అక్కడే ఉన్న అతని భార్య వారం నుండి ఎక్కడికి పోయావంటూ కాలర్ పట్టుకుని లాగి కొట్టింది. కిందపడేసి పిడిగుద్దులు గుద్దింది. ఇదంతా మంత్రి సతీష్ జార్కిహొళి కళ్ల ముందే జరుగుతున్నా భార్యభర్తల గొడవతో నాకేం పని అనుకుని చూస్తుండిపోయారు. కొందరు జనం ఆమెను శాంతపరిచారు, బాధితుడు మళ్లీ మంత్రి అనుచరులతో కలిసి వెళ్లిపోయాడు.