‘అగ్నివీర్‌’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా?

Will Agniveer Martyr Get Compensation or not here is Reality - Sakshi

ఇండియన్‌ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

అయితే సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్‌ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్‌ ఆర్మీకి సవాల్‌ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 

అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే..
రూ. 48 లక్షల జీవిత బీమా
సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు.
రూ. 44 లక్షల ఆర్థిక సహాయం
మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు.
ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం.
ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం
అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు.
ఇది కూడా చదవండి: లాక్‌డౌన్‌ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఆదేశాలు?
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top