కర్ణాటక పవర్ గేమ్‌లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్! | Wild Card Move Creates Buzz in Karnataka Politics | Sakshi
Sakshi News home page

కర్ణాటక పవర్ గేమ్‌లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!

May 26 2026 8:52 AM | Updated on May 26 2026 9:47 AM

Wild Card Move Creates Buzz in Karnataka Politics

సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.

ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. 

పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు  హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్‌గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.

రెండో ఆప్షన్‌గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్‌ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడో ఆప్షన్‌.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్‌ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్‌ కూడా హైకమాండ్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్‌లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.

పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి  కర్ణాటక కాంగ్రెస్‌ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement