బీజేపీలో చేరినా.. అరెస్ట్‌ తప్పదా? | Why Sandeep Pathak Fears With Arrest After Join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరినా.. అరెస్ట్‌ తప్పదా?

May 2 2026 12:53 PM | Updated on May 2 2026 1:31 PM

Why Sandeep Pathak Fears With Arrest After Join BJP

రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను పావుగా వాడుకుంటోందని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శ ఒకటి ఉంది. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్లను బూచిగా చూపించి ప్రతిపక్ష నేతలను లొంగదీసుకుంటోందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తుంటాయి. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీ ఇదే తరహాలో తమ గూటికి చేర్చుకుందనేది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణ.. 

అయితే ఈ జంపింగ్‌ ఎపిసోడ్‌లో ఇప్పుడు ఇంకో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆప్‌ (AAP) నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్‌ పాఠక్‌ అరెస్టు అయ్యే చాన్స్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార నివాసం నుంచి ఆయన గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నట్లు సమాచారం. 

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆయన వెనుక ద్వారం నుంచి కారులో బయటకు వెళ్లిపోయినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోందని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది.   

పంజాబ్‌లో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. అందుకు ఒకటి అవినీతి సంబంధితమైంది కాగా, మరొకటి మహిళా వేధింపుల కేసుగా తెలుస్తోంది. ఇవి నాన్‌బెయిలబుల్‌ కేసులుగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కాగా బీజేపీ లీగల్‌ సెల్‌ ఆయనకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగింది.

ఆప్‌ నుంచి బీజేపీలో చేరిన వెంటనే సందీప్‌పై ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వం ప్రతీకారం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ, అకాళీదళ్‌ విమర్శిస్తుండగా.. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టింది.

గత నెలలో ఆప్‌ రాజ్యసభ సభ్యులలో ఏడుగురు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిట్టల్‌, హర్భజన్‌ సింగ్‌, రాజిందర్‌ గుప్తా, స్వాతి మాలివాల్‌, విక్రమ్‌జిత్‌ సహ్నే ఈ లిస్ట్‌లో ఉన్నారు. మాలివాల్‌(ఢిల్లీ) తప్ప మిగతా ఆరుగురు పంజాబ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే.. పార్టీ మారిన వాళ్ల సంఖ్య 2/3 వంతు కావడంతో వీళ్లపై ఫిరాయింపుల యాంటీ-డిఫెక్షన్‌ చట్టం (Tenth Schedule) వర్తించబోదని.. అనర్హత వేటు పడకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు.

కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన సందీప్‌ పాఠక్‌.. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆప్‌ పార్టీలో ఆరంభం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. గత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయంలో ఈయన వ్యూహాలే కీలకమయ్యాయి. అదే ఏడాది ఆయన రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. అయితే ఆప్‌ తన ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ.. ఇటీవలె బీజేపీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement