
సాక్షి, ఢిల్లీ: హస్తినలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్‌ఖడ్(74) చేసిన రాజీనామా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రిత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫేర్‌వెల్ స్పీచ్, ఈవెంట్ లేకుండానే ఆయన నిష్క్రమించడం పలు కోణాల్లో చర్చకు కారణమైంది.
ధన్‌ఖడ్ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. నిన్న బీఏసీకి జేపీ నడ్డా, కిరెన్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాలేదు. దీంతో ధన్‌ఖడ్ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నాం 1గం. నుంచి సాయంత్రం 4.30గం. మధ్య ఏదో జరిగింది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ట్వీట్ చేశారు. ధన్‌ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలే ఉన్నాయని అంటున్నారాయన. ఇక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘‘ధన్‌ఖడ్ రాజీనామా ఆయన నిర్ణయం. ఆయన రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు’’ అంటూ కామెంట్ చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్ననే(జులై 21) ప్రారంభం అయ్యాయి. రాజ్యసభకు చైర్మన్ హోదాలో ధన్‌ఖడ్ హాజయ్యారు. సభలో హుషారుగానూ కనిపించారు. అంతేకాదు.. సాయంత్రం ఆరు గంటల దాకా ఆయన్ని పలువురు నేతలు వెళ్లి కలిశారు. ఈలోపు అనూహ్యంగా.. రాత్రి 9:30గం. సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
జగ్దీప్‌కు ఈ మధ్యే గుండెకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు. అనారోగ్య కారణంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని తన ఆర్టికల్ 67 (ఏ) కింద రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ.. ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు కూడా. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఇలా రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..
ధన్‌ఖడ్ రాజీనామా వెనుక వ్యక్తిగతం కాదని.. రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ ప్రముఖంగా నడుస్తోంది. బీజేపీ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాత్రం ప్రతిపక్షాల అనుమానాలపై మండిపడ్డారు. గతంలో ఆయన్ని అభిశంసించేందుకు(పదవి నుంచి తొలగించేందుకు) ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను గుర్తు చేసిన దుబే.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఈ అంశంలో డ్రామాలు ఆడడం ఆపాలని అంటున్నారు.
మరోవైపు.. ఉద్దేశపూర్వకంగానే బీఏసీకి హాజరు కాలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను జేపీ నడ్డా కొట్టిపారేశారు. తాను హాజరు కాలేకపోతున్నాననే సమాచారం ధన్‌ఖడ్‌కు ఇచ్చానని తెలిపారాయన.
దాల్ మే కుచ్ కాలా హై రీతిలో.. ధన్‌ఖడ్ రాజీనామా వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకే ధన్‌ఖడ్‌తో బలవంతంగా రాజీనామా చేయించారని విపక్ష నేతల మధ్య చర్చ నడుస్తోంది.
గతంలో.. మనదేశంలో ఉపరాష్ట్రపతి పదవికి మధ్యంతర రాజీనామాలు చాలా అరుదైనవే. వీవీ గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్‌లు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే వీళ్లు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ,
భైరాన్‌సింగ్ షెకావత్ (2007):
- రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యాక రాజీనామా చేశారు.
- ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి 21 రోజుల పాటు ఖాళీగా ఉంది.
జగదీప్ ధన్ఖడ్ (2025):
- ఇప్పుడు ఆకస్మికంగా రాజీనామా చేసి వార్తల్లోకి ఎక్కారు
- ఆయన అనారోగ్య కారణాలు చూపించినప్పటికీ.. రాజకీయంగా వివిధ ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మరణంతో.. కృష్ణకాంత్ (2002): పదవిలో ఉండగానే మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి.
https://www.deccanchronicle.com/nation/current-affairs/dhankhar-3rd-vice-president-to-quit-mid-term-1892942