
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్‌గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.
కుమార్తె నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?