
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ఎపిసోడ్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పలు విషయాలను తాజాగా వెల్లడించారు. అసలు మే 9వ తేదీ రాత్రి ఏం జరిగింది?, ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు ఏం మాట్లాడారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు జై శంకర్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జై శంకర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ అంశం, కాల్పుల విరమణ అంశాలకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఆ రాత్రి తాను మోదీతో పాటే ఉండటంతో అక్కడ ఏం జరిగిందనేది విషయాన్ని వెల్లడించారు.
‘ఆ రోజు వాన్స్ ఫోన్ చేసి మీరు కొన్ని విషయాలను ఒప్పుకోకపోతే పాకిస్తాన్ నుంచి భారీ ముప్పు చూడాల్సి ఉంటుందనే హెచ్చరించారు. అది ఏంటనేది మోదీకి కూడా తెలియదు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన తర్వాతే జరిగిన సంభాషణ అది. పాకిస్తాన్ ఏం చేస్తుందో చూద్దాం.. మా నుంచి కూడా ప్రతిదాడి ఉంటుంది’ అని వాన్స్‌కు మోదీ తెలిపారని జై శంకర్ పేర్కొన్నారు.
‘ ఆ రాత్రి పాక్ నుంచి దాడులు ఆరంభం అయ్యాయి. దానికి మనం కూడా అంతే ధీటుగా బదులిచ్చాం. ఆ మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ రూబియో మాకు ఫోన్ చేశారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ఇలా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇది ఆ ఘటనకు సంబంధించి ఆనాటి నా వ్యక్తిగత అనుభవం’ అని తెలిపారు.
ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని కొట్టిపారేశారు జై శంకర్. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు ట్రేడ్ డీల్ కారణంగానే భారత్ వెనక్కి తగ్గిందనే వార్తల్లో నిజం లేదన్నారు. అసలు ట్రంప్‌కు కాల్పుల విరమణ అంగీకారానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు జై శంకర్.