‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం? | Sakshi
Sakshi News home page

Uttarakhand: ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?

Published Wed, Feb 7 2024 8:51 AM

What Impact will UCC Uttarakhand - Sakshi

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్‌ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 

హిందువులు
ఉత్తరాఖండ్‌లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)పై కూడా దీని ప్రభావం పడనుంది. 

ముస్లింలు 
ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది.

సిక్కు కమ్యూనిటీ 
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. 

క్రైస్తవులు 
క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు  ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది.

ఆదివాసీ సముదాయం 
ఉత్తరాఖండ్‌లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్‌లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement