Viral Video: ఆరేళ్ల క్రితం ప్రమాదం.. వీల్‌చైర్‌లో జొమాటో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు

Viral Video Of Specially Abled Zomato Agent Delivering Orders On Wheelchair - Sakshi

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్‌లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్‌టైం జాబ్‌ కింద డెలివరీబాయ్‌లా పనిచేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సమయానికి ఫుడ్‌ డెలివరీ చేయాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలు, వానలు, ట్రాఫిక్‌ వంటి ఆటంకాలను దాటుకొని కస్టమర్లకు టైంలోగా ఆర్డర్‌ అందించాల్సిందే. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని ఫుడ్‌ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి కృషి, పట్టుదల పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చెన్నైకి చెందిన 37 ఏళ్ల గణేష్‌ మురుగన్‌ జొమాటోలో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను దివ్యాంగుడు. వీల్‌చైర్‌లో కూర్చొని ఆర్డుర్లు డెలివరీ చేస్తూ బతుకు బండి లాక్కొస్తున్నాడు. దేశంలోనే తొలి వీల్‌చైర్‌ డెలివరీబాయ్‌గా అతను రికార్డు సృష్టించాడు. నడవలేని స్థితిలో ఉన్న గణేష్‌.. వీల్‌చైర్‌లో కూర్చొని ఆర్డర్‌లు అందిస్తున్న వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు. గత నాలుగు రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీటిని రీపోస్టు చేస్తూ ‘గొప్ప స్ఫూర్తికి నిజమైన ఉదాహరణ' అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆయన ధైర్యాన్ని, సంకల్ప శక్తిని కొనియాడుతున్నారు. అంతేగాక గణేష్‌కు ఉపాధి కల్పించినందుకు జోమాటోను కూడా ప్రశంసించారు.
చదవండి: చిత్రం భళారే విచిత్రం.. రాజమౌళి మూవీనే తలదన్నే వీడియో..

ఆరేళ్ల క్రితం ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో మురుగన్‌ వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. అయితే అదే అతన్ని సంకల్ప దైర్యాన్ని రెట్టింపు చేసింది. మురుగన్ లైఫ్‌ స్టోరీని జూన్‌లో ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్‌ అధికారి దీపాంషు కబ్రా మొదటిసారి ట్విట్టర్‌లో పంచుకున్నారు. కష్టాలపై పోరాడటం మానేసి చేతులెత్తేసే వారందరికీ ఇది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక మురుగన్ వీల్ చైర్‌ను మద్రాస్‌లోని ఐఐటీ స్టార్టప్ రూపొందించింది. దీనిని నాలుగు గంటలు పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top