ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ఓ ఆయుధం. దాన్ని డబ్బుకు అమ్ముకుంటుంటారు చాలా మంది. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తాం’ అని చెబుతుంటారు కొందరు. ఓట్లు వేసే వేళ తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగుతున్న వారు కూడా కనపడుతుంటారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉంటారు. ఓటుకు ఇంతగా అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్న ఈ కాలంలో.. తాము ఓటు వేసేందుకు డబ్బు వద్దని చెబుతున్నారు. రెండు గ్రామాల ప్రజలు.
‘అభ్యర్థులు డబ్బు ఇవ్వకూడదు, ఓటర్లు డబ‍్బు తీసుకోకూడదు’ అని బోర్డు పెట్టి మరీ, ఆచరణాత్మకంగా సందేశం ఇస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలోని తీర గ్రామ ప్రజలు ఓటుకు డబ్బు ఇచ్చే అభ్యర్థులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు హెచ్చరిస్తూ గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ, స్థానిక ప్రజల తరఫున తీసుకున్నారు. డబ్బు లేదా బహుమతులు ఇచ్చే అభ్యర్థులను గ్రామం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే గ్రామం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
“మా ఓటుకు ధర నిర్ణయించవద్దు, మా జీవనోపాధికి మార్గం చూపండి” అని బ్యానర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ సాధారణంగా జరుగుతుండటంపై గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ అభ్యర్థుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.
డబ్బులు తీసుకోంగానీ 100% ఓటేస్తాం
మరోవైపు, ‘మా ఓటు అమ్మకానికి లేదు’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఆలంపట్టు పెరియర్ నగర్ గ్రామ యువకులు. అంతేగాక, తమ గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదవుతుందని హామీ ఇస్తున్నారు. పెరియర్ మరుమలర్చి డాక్టర్ అంబేద్కర్ యువ నర్పణి మండలి సభ్యులు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. పలు పోస్టర్లను బస్ స్టాండ్ ప్రయాణికుల షెల్టర్ వంటి పబ్లిక్ ప‍్లేసుల్లో అతికించారు.

దీనిపై ఆలంపట్టు పెరియర్ నగర్ యువకులు మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో అందరం ఓటుకు డబ్బు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి రావద్దని గ్రామ సరిహద్దులోనే ప్రకటన బ్యానర్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి.


