హాట్‌ న్యూస్‌: ఎన్డీయే కూటమితో విజయ్‌ పొత్తు! | Is Vijay's TVK Really Alliance With AIADMK-BJP NDA Alliance | Sakshi
Sakshi News home page

హాట్‌ న్యూస్‌: ఎన్డీయే కూటమితో విజయ్‌ పొత్తు!

Apr 30 2026 2:11 PM | Updated on Apr 30 2026 2:47 PM

Is Vijay's TVK Really Alliance With AIADMK-BJP NDA Alliance

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్‌లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్‌.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. 

తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్‌ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్‌ పార్టీ డబుల్‌ డిజిట్‌ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. 

విజయ్‌ పార్టీలో జోష్‌ నిండుకుంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్‌షేరింగ్‌ కోసం విజయ్‌ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్‌ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.

వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్‌ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. 

బీజేపీ, కాంగ్రెస్‌లు విజయ్‌తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే  కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్‌ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. 

Advertisement
 
Advertisement
Advertisement