
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.
రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
📍Uttarakhand | #Watch: Torrential rains cause the Tamsa River to overflow, submerging the Tapkeshwar Mahadev Temple in Dehradun
📹: ANI/X pic.twitter.com/RPCN37x2k2— Ranveer Singh (@Ranveer6829) September 16, 2025
మరోవైపు.. డెహ్రాడూన్ క్లౌడ్‌బరస్ట్‌తో రిషికేష్‌లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్‌ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్‌లో క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్‌ను సందర్శించి.. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1,200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు.
