
నేపాల్‌లో సంభవించిన తాజా పరిణామాలు అక్కడి సంక్షోభ ప్రభావం ఎల్లలు దాటుతోంది. అనేక దేశాల్లో విస్తరించిన ఉన్న నేపాలీయుల గుండెల్లో గుబులు రేపుతోంది. అదే క్రమంలో మన దేశంలోని పలు సంప్రదాయ వ్యభిచార కేంద్రాల్లో, కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన ప్రాంతంలోనూ ఈ పరిణామాల ప్రభావం పడింది. కోల్‌కతాలో, ముఖ్యంగా సోనాగాచిలో నేపాల్ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి, గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినప్పటికీ అక్కడ నేపాల్ మహిళలు పెద్ద సంఖ్యలోనే ఇప్పటికీ వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కాలిఘాట్ నుంచి హౌరా హుగ్లీలోని పలు వ్యభిచార గృహాలలో నేపాలీలే ప్రధాన భాగాన్ని ఆక్రమించారు, ప్రస్తుతం నేపాల్‌లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
‘‘నేను మూడు రోజులుగా నా తల్లితో మాట్లాడలేదు. నేను కాల్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, నెట్‌వర్క్ పనిచేయడం లేదని ఫోన్ చెబుతుంది. ఆమె సురక్షితంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు,’’ అని దశాబ్ద కాలంగా సోనాగాచిలో నివసిస్తున్న తూర్పు నేపాల్‌కు చెందిన ఒక సెక్స్ వర్కర్ తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘ప్రతి నెలా నేను పోఖారా సమీపంలోని మా తాతామామలతో నివసించే నా ఇద్దరు కుమారులకు డబ్బు పంపుతాను. ఈ నెల, నేను ఏదైనా పంపగలనో లేదో నాకు తెలియదు. వారికి డబ్బు రాకపోతే, నా పిల్లలు ఏం తింటారు? ఎలా తింటారు?’’ అంటూ మరొక మహిళ విలపించింది.
వీరందరి ఆందోళన ఏమిటంటే వారి కుటుంబాల మనుగడ. వారు అలా వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చి విటుల ముందు తమ శరీరాన్ని విస్తరాకులా పరుస్తున్న కారణమే అది. మన కోల్‌కతా నుంచి నేపాల్‌కు వీరి ద్వారా వెళ్లే మొత్తాలు పెద్దవేమీ కాకపోయినప్పటికీ, గ్రామీణ నేపాల్‌లోని పలు కుటుంబాలకు అవే జీవనాధారం. ఈ ఆకస్మిక సంక్షోభం వీరిపై ఆర్థిక ఒత్తిడిని సృష్టించడమే కాకుండా వారి నిస్సహాయ భావనను మరింత తీవ్రతరం చేసింది. ‘‘మేం ఇంటికి వెళ్లాలనుకుంటున్నా, మార్గం కనపడడం లేదు,’’ అని సోనాగాచిలోని మరో నేపాలీ మహిళ అన్నారు. ‘‘సరిహద్దు మూసివేశారు అనేక విమానాలు రద్దు అయ్యాయి. మేం ఇక్కడ మా కుటుంబాలు అక్కడే చిక్కుకున్నాయి.
మేం నిస్సహాయంగా ఉన్నాం.’’ అంటూ ఆమె భోరుమంది. ‘‘ఈ మహిళలు బాధలో ఉండటం సహజం. వారు తమ కుటుంబాలను సంప్రదించలేరు, అలాగే చెల్లింపులు వారికి చేరుతాయో లేదో కూడా వారు ఖచ్చితంగా చెప్పలేరు. అధికారులతో సమావేశం నిర్వహించి, వారు తమ కుటుంబాలతో మాట్లాడి ఇంటికి తిరిగి డబ్బు పంపగలిగే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము‘ అని స్థానిక మహిళల సమస్యలపై పనిచేసే ముఖోపాధ్యాయ అన్నారు. సోనాగాచిలోని రెడ్–లైట్ జిల్లాలో దాదాపు 200 మంది నేపాలీ సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. దశాబ్దాలుగా, నేపాలీ మహిళలు కోల్‌కతాలోని రెడ్–లైట్ బెల్ట్‌లలో నివసిస్తూన్నారు. తరచుగా అక్రమ రవాణా కారణంగా సరిహద్దులు దాటి దారుణమైన పరిస్థితులలో తప్పనిసరై ఈ మురికికూపంలో మగ్గిపోతున్నారు.