
హ్యూమనాయిడ్ రోబోలు.. అచ్చం మనలానే ఉండే, ఆలోచించగలిగే రోబోలు. ఇవి మన జీవితంలో భాగమైపోయే రోజులు మరెంతో దూరంలో లేవు. చైనాలో జరుగుతున్న రోబో గేమ్స్.. ఏకంగా గర్భం దాలుస్తున్న రోబో.. రోబోల షాపింగ్ మాల్‌లే ఇందుకు నిదర్శనం.
రోబోల గేమ్స్
చైనాలోని బీజింగ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో గేమ్స్.. శుక్రవారం నుంచి 3 రోజులపాటు జరిగాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి 16 దేశాలకు చెందిన హ్యూమనాయిడ్ రోబో క్రీడాకారులు పాల్గొన్నారు.
⇒ ఏయే క్రీడలు: ఫుట్‌బాల్, పరుగు పందేలు, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, ఔషధాలు వేరు చేయడం, వస్తువులను జాగ్రత్తగా తీసుకోవడం, క్లీనింగ్ సేవలు వగైరా
⇒ ఎన్ని టీములు: 280
⇒ మొత్తం ఎన్ని రోబోలు: సుమారు 500కుపైగా
⇒ టికెట్ ధర: సుమారు రూ.1,600 నుంచి రూ.7,000 వరకు
⇒ విశేషాలు: ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో నాలుగు రోబోలు ఒకరినొకరు ఢీకొట్టి పడిపోయాయట. లేవలేకపోతుంటే.. వాటిని నిర్వాహకులు లేపుతుంటే చూసిన వాళ్లంతా తెగ నవ్వుకున్నారట. 1500 మీటర్ల పరుగు పందెంలో మరో రోబో పరిగెడుతూ పరిగెడుతూ హఠాత్తుగా పడిపోయిందట. ‘చార్జింగ్ అయిపోయిందేమో’ అని తెగ జోకులు వేసుకున్నారట. విజేత సుమారు 6.29 నిమిషాల్లోనే గమ్యం చేరుకుందట. ఈ విభాగంలో మనుషుల వరల్డ్ రికార్డు 3.26 నిమిషాలట.
⇒ ముక్తాయింపు: ఏతావాతా తేలిందేంటంటే.. ఈ హ్యూమనాయిడ్లు పూర్తిస్థాయిలో తమంతట తాము పనిచేయలేకపోయాయట. మనుషుల సాయం కావాల్సి వచ్చిందట.
ఏ పనైనా చేసిపెడతాయ్!
రోబోలు బాబూ.. రోబోలు.. ఇళ్లు తుడిచి, బట్టలు ఉతికే రోబోలు.. మీ దుకాణంలో నమ్మకంగా, సమర్థంగా పనిచేసే రోబోలు.. ఇలాగే అమ్ముతూ ఉంటారేమో అక్కడ.
⇒ ఎక్కడ: బీజింగ్‌లో.. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో షాపింగ్ మాల్ తెరిచారట. అక్కడి హైటెక్ ఈ–టౌన్ డిస్ట్రిక్ట్‌లో ఈ మాల్‌లో 100 రకాల రోబోలు అమ్మకానికి పెట్టారట.
⇒ కనీస ధర: సుమారు రూ.25వేలు. గరిష్టంగా లక్షల నుంచి కోట్ల వరకు ఉందట.
⇒ ఆకర్షణ: అల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను పోలిన హ్యూమనాయిడ్. దీని ధర 97,000 డాలర్లు... అంటే రూ.85 లక్షలే.
⇒ ఏం చేస్తాయి?: వంట, కాఫీ తయారీ, పెయింటింగ్, ఆటలు వగైరా.
రోబో గర్భిణి
ఇక భవిష్యత్తులో ఆడవాళ్లే గర్భం దాల్చాలన్న అవసరం ఉండకపోవచ్చు. దానికీ మేమున్నాం అంటూ హ్యూమనాయిడ్ రోబోలు వచ్చేస్తున్నాయి.
⇒ ఎవరు?: సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జాంగ్ కిఫెంగ్ ప్రపంచంలోని మొట్టమొదటి గర్భిణి రోబోను రూపొందించారు.
⇒ ఎలా?: మహిళలు ఎలాగైతే 9 నెలలూ గర్భం మోసి బిడ్డలను కంటారో ఈ రోబో కూడా అలాగే చేస్తుంది.
⇒ ఏంటిది?: ఇదంతా పూర్తిగా కృత్రిమ గర్భ సాంకేతికత. రోబో కడుపులో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులో బిడ్డ ఎదగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారట. మహిళల్లో ఉమ్మనీరు ఎలా ఉంటుందో.. ఇందులోని అలాంటి ద్రవాన్నీ ఉంచారట. ఈ సాంకేతికత ఇప్పటికే పరిణత దశలో ఉంది. దీన్ని రోబో గర్భంలో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందట.
కొత్తదా? అయితే ఇదేమీ కొత్తది కాదని జాంగ్ అంటున్నారట. గతంలో అపరిపక్వ దశలో ఉన్న గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ గర్భంలోనే పెట్టి, ఒక పిల్లను సృష్టించారట. అది బతికే ఉందనీ.. ఇదీ అలాంటి ప్రక్రియే అంటున్నారాయన.
⇒ ఎప్పటికి?: వచ్చే ఏడాదికి సిద్ధమైపోతుందట.
⇒ ధర: సుమారు రూ.12.96 లక్షలు
⇒ భవిష్యత్తు: ఇదే నిజమైతే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టం. ఎందుకంటే.. మహిళలకు ఇక, గర్భధారణ కష్టమే ఉండదు. ఇక, ఎంతమంది పిల్లలనైనా రోబోలు కనొచ్చు. ఎవరి అండం, వీర్య కణాలతోనైనా రోబోల్లో ప్రవేశపెట్టి పిల్లలను పుట్టించవచ్చు. ఏమో.. ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే.