వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్‌లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్‌కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్‌కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.
అయితే.. సంభల్‌కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్‌తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్‌తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్‌కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది.


