
చెన్నై: కరూర్ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్ర అన్న అనుమానాన్ని తమిళగ వెట్రి కళగం న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. అడయార్‌లోని న్యాయమూర్తి దండపాణి నివాసానికి చేరుకుని కేసును సుమోటోగా స్వీకరించాలని విన్నవించారు. ఇందుకు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.
కరూర్ ఘటనతో తీవ్ర మనో వేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ఎక్స్ పేజి ద్వారా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి తలా రూ. 2 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటీ వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు.
ఇంటి వద్ద భద్రత పెంపు
విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు కరూర్ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి.
5 సెక్షన్లతో కేసు నమోదు
విజయ్ పార్టీకి చెందిన కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటుగా ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.సెక్షన్ 105,110, 125, 223, సెక్షన్ 3 కింద నాన్ బెయిల్ బుల్ వారెంట్‌తో కూడిన కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి విచారించేందుకు కరూర్ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.
కుట్ర కోణంపై అనుమానాలు
విజయ్ వేలుస్వామి పురం వద్దకు వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్‌లు రావడం, ఓ చోట లాఠీచార్జ్ జరిగినట్టు వీడియోలు వైరల్ కావడం, విజయ్ వాహనంపైకి రాళ్లు రువ్వినట్టుగా వచ్చిన సంకేతాలను తమిళ వెంట్రికళగం న్యాయవాద విభాగం తీవ్రంగా పరిగణించింది. కరూర్ ఘటన ప్రమాదంగా తెలియడం లేదని, పథకం ప్రకారం జరిగిన కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ న్యాయవాదుల బృందం చెన్నై అడయార్ నివాసంలో న్యాయమూర్తి దండపాణిని కలిసి అనుమానం వ్యక్తం చేశారు.
కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. కేసును సీబీఐకు లేదా ప్రత్యేక సిట్‌కు అప్పగించి విచారించాలని విన్నవించారు. చివరగా పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం మధ్యాహ్నం విచారిస్తానంటూ ఆయన పేర్కొనడంతో ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయవాద విభాగం చర్యలు చేపట్టింది. కాగా, విజయ్ మనస్సు తీవ్రంగా రోదిస్తుందని.. ఆయన తీవ్ర ఉద్వేగంతో ఉన్నారని న్యాయవాద బృందం మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా భద్రతా వైఫల్యాలు, కరూర్ ఘటనను పరిగణించి ఇక విజయ్ ప్రచారాలకు నిషేధం విధించాలంటూ వేలుస్వామి పురం ఘటనలో బాధితుడైన సెంథిల్ కన్నన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో కొద్ది రోజులు ప్రచార పర్యటనను వాయిదా వేసుకునే విధంగా విజయ్ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా పుష్ప–2 చిత్రం విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లుఅర్జున్‌ను అరెస్టు చేసినట్టుగా కాగా ఘటనలో విజయ్‌ను అరెస్టు చేయాలంటూ సామాజిక మాద్యమాలలో కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. అలాగే అనేక చోట్ల సేలం, ఈరోడ్‌లతో పాటూ పలుచోట్ల ఇదే తరహాలో పోస్టర్లు వెలిశాయి.