
కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎల్‌టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించారాయన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నాగపట్టణంలో జరిగిన టీవీకే ప్రచార సభలో విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఈళం తమిళులు మన సంతతి వాళ్లు. వాళ్లు శ్రీలంకలో ఉన్నా.. ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. తమ నాయకుడ్ని కోల్పోయిన బాధలో ఉండి ఉంటారు. ఆయన(ప్రభాకరన్‌ను ఉద్దేశించి..) వాళ్లకు తల్లి లాంటి ప్రేమను పంచారు. శ్రీలంక తమిళుల కోసం మనం గొంతెత్తడం మన బాధ్యత’’ అని ప్రసంగించారు.
నాగపట్టణం శ్రీలంక సమీపంలో ఉండడం.. ఈళం తమిళుల సమస్య కారణంగా మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో మత్స్యకారుల సమస్యలపైనా ఆయన మాట్లాడారు. ‘‘మేం డీఎంకేలా ప్రభుత్వంలా సుదీర్ఘమైన లేఖలు రాసి.. ఆపై మౌనంగా ఉండిపోం. మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఇది టీవీకే ప్రధాన అజెండా కూడా అని అన్నారు. మత్య్సకారుల జీవితాలు ఎంత ముఖ్యమో.. ఈలమ్ తమిళుల జీవితాలు కూడా మాకు అంతే ముఖ్యం అని అన్నారాయన.
అయితే శ్రీలంక తమిళులకు విజయ్ మద్దతు ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక అంతర్యుద్ధ (2008 చివరి నుంచి 2009 మే వరకు) సమయంలో ఉత్తర శ్రీలంకలోని ముల్లివాయ్క్కాల్ ప్రాంతంలో సైన్యం చేతిలో తమిళులు ఊచకోతకు గురికావడం తీవ్ర దుమారం రేపింది. దీనికి నిరసగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయ్ పాల్గొని శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆ సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వడం అంటే ఎల్‌టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ..
గతంలో కరుణానిధి సహా తమిళనాడుకు చెందిన ఏ రాజకీయ నేత కూడా నేరుగా ప్రభాకరన్‌పై ఈ స్థాయిలో ప్రశంసలు గుప్పించిన దాఖలాలు లేవు. ప్రభాకరన్‌ను తాను ఉగ్రవాదిగా చూడడని.. అయితే ఈళం తమిళుల కోసం ఎల్‌టీటీఈ లక్ష్యాలు గొప్పవే అయినా.. ఆచరించే పద్దతులు సరికావంటూ కరుణానిధి బహిరంగంగానే చెబుతుండేవారు. అలాంటి విజయ్ ఇప్పుడు బహిరంగంగా ప్రభాకరన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్
విజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. ప్రభాకరన్ LTTE అధినేతగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తిని పొగడటం భారత ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పైగా ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ గ్రూప్ అధినేతను పొగడడం చట్టపరంగా, నైతికంగా అనుచితం అని మాణికం ఠాగూర్ అన్నారు.
ఎల్‌టీటీఈ ప్రస్థానం
LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం) అనేది 1976లో స్థాపితమైన ఒక సాయుధ సంస్థ. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈళం ప్రాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఫలితంగా ఆ సంస్థకు, సైన్యానికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో వేలాది శరణార్థులుగా భారత్‌కు వచ్చారు. అయితే.. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) పేరిట సైన్యాన్ని శ్రీలంకకు పంపించారు. మూడేళ్లపాటు అది ఆ సాయుధ సంస్థతో యుద్ధం చేసి 1990లో భారత్‌కు తిరిగి వచ్చేసింది. అయితే.. ఈ చర్యను ద్రోహంగా భావించిన ఎల్‌టీటీఐ ప్రతీకారం కోసం ఎదురు చూసింది.
1991లో శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాజీవ్ గాంధీ.. మానవ బాంబు జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఈ ఘటన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం ఎల్‌టీటీఈని నిషేధించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరియు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే.. రాజీవ్ గాంధీని తామే హతమార్చినట్లు ఎల్‌టీటీఈ ఏనాడూ అధికారికంగా ఒప్పుకోలేదు. అలాగని ఖండించనూ లేదు. చివరకు 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఎల్‌టీటీఈ ఓడిపోవడమే కాకుండా.. ఆ గ్రూప్ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యారు. అప్పటితో LTTE అంతరించిపోయింది.