మహిళా కార్మికులతో రాష్ట్రపతి ముర్ము.. ‘ఇక్కడ ఉన్న మీ ముఖ్యమంత్రిని గుర్తు పడతారా?’

Tripura Visit: Can You Identify The CM President Murmu Asks Tea Workers - Sakshi

త్రిపుర: రెండు రోజుల త్రిపుర పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నార్సింగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. అంతకుముందు రాజధాని అగర్తలా విమానాశ్రయంలో సీఎం మాణిక్‌ సాహా, గవర్నర్‌ సత్య నారాయన్‌ ఆర్యా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా నార్సింగర్‌కు వెళ్లి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెతోపాటు సీఎం సాహా, కేంద్రమంత్రి రతన్‌లాల్‌ నాథ్‌, త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆమె మోహన్‌పూర్‌లోని దుర్గాబరి టీ ఎస్టేట్‌ను సందర్శించారు. అక్కడ పనిచేసే టీ గార్డెన్‌ కార్మికులతో ముచ్చటించారు. ఈక్రమంలో ముర్ము వారితో ఓ ఆసక్తికర సంభాషణ సాగించారు. మహిళా కార్మికులతో మాట్లాడిన రాష్ట్రపతి వారి బాగోగులు కనుకున్నారు. ‘పిల్లలను బడికి పంపిస్తున్నారా? క్రమం తప్పకుండా పిల్లలను బడికి పంపించండి. ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అష్టమి ముండా అనే మహిళను అడిగి తెలుసుకున్నారు. 
(చదవండి: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్‌ రౌత్‌ భావోద్వేగ లేఖ)

మరో మహిళతో ఆమె మాట్లాడుతూ.. నాతోపాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు కదా? వారిలో మీ ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాను, స్థానిక ఎమ్మెల్యే కృష్ణధన్‌దాస్‌ను గుర్తు పడతారా? అని అడిగారు. అందుకు వారు ఔను అనే సమాధానం ఇచ్చారు. స్థానిక నేతలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా? ఏదైనా డిమాండ్‌ ఉన్నా వారితో మాట్లాడండి అని రాష్ట్రపతి భరోసానిచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే దాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్ము టీ ఎస్టేట్‌ను సందర్శించడం.. కార్మికులతో మమేకమవడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు.
(చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి.. వైరల్‌ వీడియో)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top