
కేసీ వేణుగోపాల్‌కు నివేదిక అందజేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
పీఈసీ, పీఏసీ, క్రమశిక్షణ కమిటీలపై సైతం ప్రతిపాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ కూర్పు తుది దశకు చేరింది. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యవర్గంతోపాటు పార్టీలోని వివిధ కమిటీల చైర్మన్లకు సంబంధించిన పేర్లను అందులో చేర్చారు. దీనిపై తుది పరిశీలన అనంతరం రెండుమూడు రోజుల్లో కార్యవర్గ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కువమందికి అవకాశం కల్పించేలా..
కొత్తగా ఏర్పాటు చేయనున్న టీపీసీసీకి జంబో కార్యవర్గమే ఉండనున్నట్టు తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. మొదట ఐదు నుంచి ఆరు పేర్లు అనుకున్నా, దానిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాలకు ఇచ్చేలా నాలుగుకు కుదించారు. ఈ పోస్టు కోసం ఎక్కువ మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక్కోవర్గం నుంచి ముగ్గురేసి పేర్ల చొప్పున 12 మంది పేర్లను సిఫార్సు చేశారు. హైకమాండ్ సూచనల మేరకు అందులో ఒకరి పేరు ఖరారు కానుంది.
వైస్ ప్రెసిడెంట్లుగా 35 మంది వరకు ఉంటారు. అయితే 50 మంది పేర్లను ఏఐసీసీ ముందుంచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులుగా 80 మందిని నియమించుకున్నారు. ప్రతి జిల్లాకు కచ్చితంగా ఇద్దరేసి చొప్పున అవకాశం ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మాత్రం ఎక్కువ మందికి అవకాశం కల్పించనున్నారు.
పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (పీఈసీ), పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ), క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మీడియా కమిటీలకు సైతం పలువురు పేర్లను సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలను టీపీసీసీ చీఫ్ ఏఐసీసీకి అందజేశారు. వీటిపై మరోమారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు రాష్ట్ర నేతలను సంప్రదించిన అనంతరం కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశముంది.