తుక్డే గ్యాంగ్‌కు మద్దతా? | TMC supports tukde-tukde gang to cut Siliguri Corridor | Sakshi
Sakshi News home page

తుక్డే గ్యాంగ్‌కు మద్దతా?

Apr 13 2026 4:44 AM | Updated on Apr 13 2026 4:44 AM

TMC supports tukde-tukde gang to cut Siliguri Corridor

ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేసే కుట్రలకు తృణమూల్‌ దన్ను

సిలిగురి ఎన్నికల ప్రచారంలో మోదీ

సిలిగురి: ‘‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భూభాగం నుండి వేరు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌ (చికెన్‌ నెక్‌)ను తెంచేస్తామని తుక్డే–తుక్డే గ్యాంగ్‌ బెదిరించింది. బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకుంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ తుక్డే గ్యాంగ్‌కు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతిచ్చింది. ఇదే ఆ పార్టీ అసలు రంగు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు.

 ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు. ఆ పార్టీ యువత, గిరిజనులు, మహిళల వ్యతిరేకి అని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్‌ తీవ్రంగా నష్టపోయిందని, దుర్బర స్థితిలోకి జారుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురి కారిడార్‌ను దేశ రక్షణకు, శ్రేయస్సుకు మధ్య వారధిగా ప్రధాని అభివరి్ణంచారు. 

ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి, పటిష్టంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సిక్కింను సిలిగురితో అనుసంధానించే సేవోక్‌–రాంగ్‌పో రైల్వే రైల్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో బెంగాల్, సిక్కిం అనుసంధానం ఏర్పడడమే గాక స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం ఊపందుకుంటుందని, యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 

దోషులు మూల్యం చెల్లించాల్సిందే 
బెంగాల్‌లో అభివృద్ధి జరగాలంటే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలని మోదీ అన్నారు. ‘‘ప్రగతిని పక్కనపెట్టి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలి. మదర్సాల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు ఇవ్వడమేమిటి? ఉత్తర బెంగాల్‌కు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. గత 15 ఏళ్లలో చేసిన ఖర్చులకు మమత సర్కారు సమాధానం చెప్పాలి.

 బీజేపీ అధికారంలోకి రాగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం. తప్పు చేసినవారు మూల్యం చెల్లించాల్సిందే. 15 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్‌లో అమలు కాకపోవడం దారుణం. తృణమూల్‌ వైఖరితో ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో క్రూరమైన ప్రభుత్వం ఉంది. ఆ భయానక పాలన పట్ల జనం విసుగెత్తిపోయారు. దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. 

బీజేపీకి ఒక్క చాన్స్‌ 
తృణమూల్‌ నిర్వాకాల వల్ల బెంగాల్‌లోకి అక్రమ వలసలు పోటెత్తాయని మోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో చొరబాటుదార్లు తిష్టవేశారు. దాంతో స్థానికంగా జనాభా నిష్పత్తి మారిపోయింది. సామాజిక సమతుల్యం దెబ్బతిన్నది. బెంగాల్‌ ప్రజల భాష, సంస్కృతుల్లో మార్పులొచ్చాయి. స్థానికుల ఉపాధి, ఉద్యోగాలను చొరబాటుదార్లు కొల్లగొట్టారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే చాలా ఆలస్యం చేసినవాళ్లమవుతాం. అందుకే మన నినాదం ‘కమల్‌ ఖిలావో, ఘుస్పతియా భగావో (కమలానికి ఓటేద్దాం, చొరబాటుదార్లను గెంటేద్దాం)’. ఉత్తర బెంగాల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని కేంద్రం సంకల్పిస్తే మమత సర్కారు సహకరించలేదు. 

బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్తర బెంగాల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాం. ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలు, క్యాన్సర్‌ ఆసుపత్రి, ఫ్యాషన్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తాం. బెంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్‌కు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క చాన్సిచ్చి చూడండి. ఆడబిడ్డలకు భద్రత కల్పించడానికి, చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, చట్టబద్ధ పాలన స్థాపించడానికి, పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి, ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి, బుజ్జగింపు రాజకీయాల బారి నుంచి బెంగాల్‌ సంస్కృతిని కాపాడడానికి మాకు అవకాశమివ్వండి’’ అని బెంగాలీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement