లదాఖ్‌లోని లేహ్ సమీపంలో గల తంగ్‌స్తే ప్రాంతంలో మే 20న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుండి ముగ్గురు భారత ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. మే 20న జరిగిన ఈ ఘటనను అధికారులు ఈ ఉదయం ధృవీకరించారు.అయితే ప్రమాదం తర్వాత మేజర్ జనరల్ మెహతా మిగతా ఇద్దరు అధికారులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చీతా రకానికి చెందిన ఆ హెలికాప్టర్‌లో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్, 3వ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్‌ను నడుపుతుండగా, మేజర్ జనరల్ మెహతా ప్రయాణికుడిగా అందులో ఉన్నారని ఒక సైనికాధికారి తెలిపారు. ఈ ప్రమాదం సందర్భంగా వీటి సెల్పీ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఇదీ చదవండి: చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్ : హై ప్రొటీన్ కోసం ఏది బెటర్
తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ పక్కన అధికారులు రాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యం ఆ చిత్రంలో కనిపిస్తోంది. అక్కడి కఠినమైన పర్వత ప్రాంతం కాలం చెల్లిన చీతా హెలికాప్టర్ల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, వారు ప్రాణాలతో బయటపడటం ఒక "అద్భుతం" అని అభివర్ణించారు.
కాగా ఈ ప్రమాదంపై అధికారిక విచారణకు ఆదేశించారు. అలాగే, 1970లలో ప్రవేశపెట్టిన చీతా హెలికాప్టర్ల భద్రతపై ఈ సంఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. 1984లో సియాచిన్ గ్లేసియర్‌లో పాకిస్తాన్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన 'ఆపరేషన్ మేఘదూత్' లో ఈ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇటీవల కాలంలో జరిగిన పలు ప్రమాదాల వల్ల అనేకమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఆర్మీ ఈ చీతా హెలికాప్టర్లను దశలవారీగా తొలగిస్తూ, వాటి స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్వదేశీంగా తయారు చేసిన 'లైట్ యుటిలిటీ హెలికాప్టర్' (LUH) ను ప్రవేశపెడుతోంది. ఆర్మీ ఇప్పటికే ఆరు పరిమిత సిరీస్ ప్రొడక్షన్ LUHల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ హెలికాప్టర్లు గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు, 6.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు మరియు 350 కిలోమీటర్ల కార్యాచరణ పరిధిని కలిగి ఉంటాయి.
ఐదుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న చీతా హెలికాప్టర్.. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో పనిచేయగల ప్రపంచంలోని అత్యుత్తమ హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, తాజా ప్రమాదం పాతబడుతున్న హెలికాప్టర్ల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది.
ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!


