
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బలంగా డివైడర్‌ను ఢీకొని..
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ‘థార్’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్‌కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న ‘థార్’
మహీంద్రా థార్ కారుకు సంబంధించిన మరో ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత నెలలో ఢిల్లీలోని మోతీ నగర్‌లో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక బైకర్ మృతిచెందాడు. కారు- ట్రక్కు మధ్యలో బైక్ పూర్తిగా నలిగిపోయినట్లు దృశ్యాలు నాడు వైరల్ అయ్యాయి. ‘థార్’ విండ్‌షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. థార్ డ్రైవర్ అమరీందర్ సింగ్ సోధి ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయాడు. పోలీసులు వాహనంలో రెండు మద్యం సీసాలను కనుగొన్నారు.
రాష్ట్రపతి భవన్ సమీపంలో మరో ప్రమాదం
మరో సంఘటనలో న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక పాదచారి మృతి చెందాడు. ఈ ప్రమాదం రాష్ట్రపతి భవన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా పాదచారి మృతదేహం నాలుగు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉంది. నిందితుడు నిద్రమత్తులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, ఒక మహిళ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసిన వెంటనే దానిని నడిపేందుకు చేసే ప్రయత్నంలో అది అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.