
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో అరెస్ట్ చేశారు. ఈ దాడికి అతనిని ప్రేరేపించిన జాహ్నవి అలియాస్ అర్చనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కాబోయే భర్త ప్రియురాలిపై యాసిడ్ దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని అమ్రోహా జిల్లాలోని తిగ్రి గ్రామానికి చెందిన నిషు తివారీ (30)గా గుర్తించారు. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 22 ఏళ్ల టీచర్ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా, నిందితుడు స్కూటర్‌పై వస్తూ, దేహ్పా గ్రామం సమీపంలో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కృష్ణ కుమార్ తెలిపారు. దాడిలో టీచర్‌కు 20 నుండి 30 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి చేర్చారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.
ఎన్‌కౌంటర్‌లో నిందితునికి గాయాలు
గురువారం రాత్రి కళ్యాణ్‌పూర్ గ్రామం సమీపంలో స్కూటర్‌పై వెళుతున్నప్పుడు నఖాసా పోలీసులు నిషును ఆపినప్పుడు, అతను అధికారులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో అతని రెండు కాళ్లకు దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు. వెంటనే నిషును అరెస్టు చేసి, చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు కార్ట్రిడ్జ్‌లు, స్కూటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్కాచెల్లెళ్ల పేరుతో నాటకమాడి..
పోలీసులు విచారణలో నిషు తివారి పలు ఆసక్తికర వివరాలు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మహిళ తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని, ఆమె డాక్టర్ అర్చనగా పరిచయం చేసుకున్నదని తెలిపాడు. డాక్టర్ అర్చన తనతో.. ఆమె సోదరి జాన్వికి ఒక సైనికుడితో నిశ్చితార్థం జరిగిందని, అయితే అతనికి అప్పటికే ప్రియురాలు ఉండటంతో అతను వివాహాన్ని రద్దు చేసుకున్నాడని వివరించింది. అందుకే అతని ప్రియురాలైన టీచర్‌ను అడ్డుతొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆ టీచర్‌పై యాసిడ్ దాడి చేయాలని తనకు చెప్పిందని నిషు తివారి పోలీసులకు తెలిపాడు. కాగా జాన్వి, డాక్టర్ అర్చన ఒకరేనని.. నిషు తివారీకి అబద్ధం చెప్పి, అతని చేత టీచర్‌పై యాసిడ్ దాడి చేయించిందని విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిషు తివారీ,జాన్విలను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.