అప్పు తీసుకున్న డబ్బులే తిరిగి ఇస్తారనే గ్యారంటీ లేని రోజుల్లో... అప్పనంగా వచ్చి పడిన రూ.కోట్లను సైతం కాదనుకున్న ఓ మహిళా రైతు డబ్బుకి లోకం దాసోహం అనే నేటి నానుడిని తిరగరాస్తోంది. తన అకౌంట్లో పడిన కోట్ల రుపాయలు డబ్బుని తిరిగి ఇచ్చేసి.. నేటి లోకానికి ఆదర్శంగా నిలిచింది
ఉత్తరప్రదేశ్‌లోని మైనపురి జిల్లా, బిచ్వాన్ ప్రాంతంలోని దేవగంజ్ గ్రామానికి చెందిన సీత ఒక రైతు..అంతేకాకుండా ఒక చిన్న కిరాణా దుకాణాన్ని కూడా నడుపుతోంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో, అష్టమి రోజున పొలంలో పనిచేస్తుండగా తన బ్యాంకు నుంచి ఒక ఎస్సెమ్మెస్ తో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. తన బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్లు గమనించింది. ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి తన కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్లింది. అయితే అది సెలవు దినం కావడంతో బ్యాంకు మూసివేసి ఉంది.
దీంతో ఆమె దగ్గరలోని ఏటిఎంకు వెళ్లి తన ’బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఖాతా నిల్వను తనిఖీ చేస్తే ఆమె జీవితంలోనే అతిపెద్ద షాక్ తగిలింది. ఆమె ఖాతాలో ఉన్న నిల్వ రూ9,99,49,588గా చూపించింది. అయితే అది చూసి ఆమె ఆనందంతో ఉప్పొంగిపోవడమో తన కుటుంబానికి చెప్పి దాన్ని స్వంతం చేసుకోవడానికి పధకం వేయడమో చేయలేదు. ఖాతాలోకి అకస్మాత్తుగా ఇంత భారీ మొత్తం జమ కావడంతో తల్లి, కుమారుడు ఆశ్చర్యపోయారు. ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి అసలు ఎలా బదిలీ అయ్యిందనే విషయంపై ఆమెకు మాత్రం స్పష్టత రాలేదు.
దీని ఫలితంగా, ఆ డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో... ఆమె అందులో నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండానే తిరిగి పొలానికి వెళ్లి, తన పనిని యథావిధిగా కొనసాగించింది. వారు దీనికి సంబంధించిన ఒక వీడియోను చిత్రీకరించగా, అది అప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది తన ఖాతాలో ఇంత భారీ మొత్తం జమ అయినప్పటికీ, ఆ డబ్బును ఏమాత్రం ముట్టుకోకుండా ఉన్నందుకు సీత కుటుంబానికి ఇరుగుపొరుగు బంధుమిత్రుల ప్రశంసలు లభించాయి.
ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీత మాట్లాడుతూ, తన బ్యాంకు ఖాతాలో సాధారణంగా కేవలం అంత డబ్బు ఉండదని, ఆ డబ్బు తనకు చెందింది కానందున, మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేలా అధికారులను కోరతానని తెలిపింది. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంగంజ్ శాఖ మేనేజర్ రిషికాంత్ పాండే, ఈ సంఘటన సాంకేతిక లోపం లేదా లావాదేవీ పొరపాటు వల్ల జరిగి ఉండవచ్చని అయితే ఈ మొత్తం విత్ డ్రా చేసే అవకాశం కూడా లేదని అన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతటా విస్తత చర్చకు దారితీసింది. ముఖ్యంగా, ఆమె కుటుంబం ఆ అనుకోని నిధులను సులభంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న సమయంలో ఆమె చూపిన నిజాయితీని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసించారు.


