డెడ్‌లైన్‌ ముగుస్తోంది.. ‘కగార్‌’పై అమిత్‌ షా ఏమన్నారంటే? | Naxalism almost eliminated from Chhattisgarh's Buxar: Amit Shah in Lok Sabha | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్‌ ముగుస్తోంది.. ‘కగార్‌’పై అమిత్‌ షా ఏమన్నారంటే?

Mar 30 2026 6:33 PM | Updated on Mar 30 2026 6:46 PM

Naxalism almost eliminated from Chhattisgarh's Buxar: Amit Shah in Lok Sabha

న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు డెడ్‌లైన్‌ రేపటితో (మార్చి 31) ముగియనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు కీలక మావో నేతలు. హిడ్మా సహా పలువురు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కగార్‌పై లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్‌ షా ప్రకటన చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైంది. దేశంలో కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. కాంగ్రెస్‌ 60 ఏళ్లపాటు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించింది. గత పాలకులు ఆదివాసీలను తప్పుదోవ పట్టించారు.

గత కాంగ్రెస్‌ పాలనలో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. మావోయిస్టుల హింసలో అనేకమంది ప్రజలు నష్టపోయారు. తెలంగాణలో అనేక మంది మావో నేతలు లొంగిపోయారు. దేశంలో 12 రాష్ట్రాలు మావోయిస్టుల వల‍్ల తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్‌ వైఖరి వల్లే దేశంలో నక్సలిజం పెరిగింది. ఎన్డీఏ వచ్చాకే ఆదివాసుల హక్కులను పరిరక్షించాం. 

నక్సలిజం కథ ముగిసింది. ఆయుధాలు వీడకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆయుధాలు పట్టుకుంటే బుల్లెట్లతో మేము సమాధానం చెబుతాం. గిరిజనులను నక్సలైట్లు తప్పుదోవ పట్టించారు. వారి చేతికి ఆయుధాలు ఇచ్చి హింసకు పురికొల్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లూటీ చేశారు. జనతా సర్కారు పేరుతో ప్రజలను భ్రమలో ముంచారు. జనతా ఆదాలత్ పేరుతో ఎంతోమందిని చంపారు’ అని అమిత్‌ షా అన్నారు. 

కాగా, దేశంలో ఉన్న మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement