సంప్రదాయ కులం అస్త్రాన్ని పక్కన పెట్టిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
యువతే లక్ష్యంగా వాగ్దానాల జల్లు
సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
దశాబ్ధాలుగా బిహార్ ఎన్నికలను కుల రాజకీయాలు శాసిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ఓటర్ల మనోగతానికి అనుగుణంగా ఆర్జేడీ యువ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కొత్త పంథాలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో కులరాజకీయాల డోసును కాస్తంత తగ్గించి యువతే లక్ష్యంగా వాగ్దానాల జల్లు కురిపిస్తున్నారు. యువ తను పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతానని ఇటీవల వాగ్దానం చేశారు.
యువత పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లకుండా వాళ్ల కు ఇక్కడే ఉపాధి అవకాశాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం వలసల కట్టడి, ఆరి్ధక మద్దతు, అభివృద్ధి నినాదాలను చేస్తున్నారు. వీటిని ముందుపెట్టి ఎన్నికల్లో భారీ లబ్ధి పొందేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో 25 శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు. కులం పేరు చెప్పి ఓట్లు అడిగే బదులు వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి హామీలనిస్తూ తేజస్వీ యువరాగం అందుకున్నారు. ఈ రాగానికి యువత ఏస్థాయిలో మంత్ర ముగ్ధులు అవుతారో, ఈ మంత్రం ఏమేరకు పనిచేస్తుందనేది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు సంపూర్ణ క్రాంతి ఉద్యమంలోంచి నాయకులుగా ఎదిగిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు బిహార్‌లో వచి్చన సామాజిక, రాజకీయ పరిణామాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇద్దరు నేతలు మొన్నటివరకు కులాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ కుల రాజకీయాలు చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనుసరించిన పంథాను పక్కనబెట్టి తేజస్వీ యాదవ్ దూసుకెళ్తున్నారు. బిహార్‌లో యువ ఓటర్ల ధ్యాస ఇప్పుడు పెద్దగా కులం మీద లేదనే వాదన ఒకటి ఉంది. విద్యావకాశాలు అధికమవడం, పెరిగిన వలసలు, నగరీకరణతో యువతలో కుల ప్రస్తావన పెద్దగా లేదని తెలుస్తోంది. నిరుద్యోగ భూతాన్ని తరిమేసి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలి్పంచే నేతలకు జై కొట్టేందుకు యువ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ అంచనాలతో యువతను తేజస్వీ ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారని తెలుస్తోంది.
1.63 కోట్ల మందే గురి
బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18–32 ఏళ్ల వయసు వారు ఏకంగా 1.63 కోట్ల మంది ఉన్నారు. ఇక కొత్త ఓటర్ల సంఖ్య 14 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 70.9 శాతం కాగా, నిరుద్యోగిత రేటు 10.3 శాతంగా ఉంది. రాష్ట్రంలోని యువతలో 20 శాతం కంటే ఎక్కువ మంది నిరుద్యోగులుగా నిట్టూర్చుతున్నారు. బిహార్‌లో సరైన ఉపాధి దొరక్క బతుకుజీవుడా అంటూ ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. యువత మెరుగైన నైపుణ్యం, విద్యా సామర్థ్యాల సముపార్జన కోసం ఆర్జనపై దృష్టిపెట్టారు.
సంపాదించే ఆ కాసింత డబ్బుతో తర్వాత శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్‌కు వెళ్తున్నారు. ఇలాంటి యువ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని తేజస్వీ యాదవ్ ‘ఛత్ర యువ సంసద్’కార్యక్రమం మొదలెట్టారు. యువజన కమిషన్‌ను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని, వెనుకబడిన విద్యార్థులకు ఇంటి నుంచే ట్యూటర్ల సౌకర్యం కలి్పస్తామని హామీ గుప్పించారు. సైన్స్, గణితం, ఇంగ్లి‹Ùలో వెనుకబడిన విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు నేరుగా వెళ్లి వారి కోసం అదనపు సమయం కేటాయిస్తారని తేజస్వీ హామీ ఇచ్చారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో చేరేలా, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే స్థాయిలో బిహార్ విద్యా వ్యవస్థను సంస్కరిస్తానని వాగ్దానం చేశారు. ఈ హామీల దృష్ట్యానే బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు యువ ఓటర్ల మనోగతం వెల్లడైందని తాజా సర్వేలో తేలింది. 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అనుకూలంగా స్పందించారు.
సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)


