CycloneTauktae: గుజరాత్‌ అతలాకుతలం

Tauktae: Narendra Modi To Visit Gujarat, Diu To Review Situation - Sakshi

పెనుగాలులు, భారీ వర్షాలతో విధ్వంసం 

13 మంది మృతి 

పలు ఇళ్లు ధ్వంసం... భారీగా ఆస్తి నష్టం 

మహారాష్ట్రలో 8 మంది మృతి 

బలహీనపడిన తుపాను; రాజస్తాన్‌ మీదుగా పశ్చిమ యూపీ వైపు పయనం 

అహ్మదాబాద్‌/ముంబై/న్యూఢిల్లీ: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ గుజరాత్‌లో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా రాష్ట్రంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. తీరం దాటిన అనంతరం మంగళవారం తుపాను బలహీనపడింది. గాలుల వేగం  గంటకు 50 నుంచి 60 కిమీలకు తగ్గింది. అంతకుముందు, తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. టెలికం, విద్యుత్, రవాణా సేవలకు అంతరాయం కలిగింది.

తుపాను కారణంగా మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. టౌటే ప్రస్తుతం సాధారణ తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్‌ సహా రాష్ట్రంలోని 35 తాలూకాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అహ్మదాబాద్‌లో పలు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. బాగాసురలో 228 మిమీలు, ఉనా, గిర్‌ గధారాల్లో 203 మిమీలు, సావర్‌కుండ్లాలో 178 మిమీల వర్షపాతం నమోదైంది. అహ్మదాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 75.69 మిమీల వర్షపాతం నమోదైంది.


పెనుగాలులు, భారీ వర్షాలకు భావ్‌నగర్‌లో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ‘రాష్ట్రంలో మొత్తంగా 16 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 40 వేల చెట్లు, 70 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి’ అని సీఎం  విజయ్‌ రూపానీ తెలిపారు. 5,951 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. సముద్రంలో చిక్కుకుపోయిన 8 మంది మత్స్యకారులను మంగళవారం కోస్ట్‌ గార్డ్స్‌ రక్షించారు.

బలహీనపడిన తుపాను మే 19, 20 తేదీల్లో ఈశాన్యంగా రాజస్తాన్‌ మీదుగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్తోందని   కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తుపాను కారణంగా బుధవారం గుజరాత్‌లోని అమ్రేలి, భావ్‌నగర్, నవ్సారి, వల్సాద్‌ తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను కారణంగా ముంబైలో ముగ్గురు, థానే, పాల్ఘార్‌ల్లో ఐదుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. 


బార్జ్‌ పీ–305 నుంచి సిబ్బంది రక్షించి తీసుకొస్తున్న దృశ్యం 

317 మందిని కాపాడిన నేవీ, కోస్ట్‌గార్డ్స్‌ 
అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళం, తీర రక్షక దళం 317 మందిని రక్షించాయి. పెనుగాలులు, భీకర అలల ధాటికి ముంబై తీరం నుంచి సముద్రంలో కొట్టుకుపోయిన బార్జ్‌ల నుంచి వారిని రక్షించారు. అయితే, సముద్రంలో ఆయిల్‌ ఫీల్డ్స్‌ కేంద్రాల్లో మరో 390 మంది చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు. టౌటే కారణంగా 707 మంది సిబ్బందితో ఉన్న మూడు బార్జ్‌లు (చదునుగా ఉండే భారీ పడవలు), ఒక ఆయిల్‌ రిగ్‌ సోమవారం సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటిలోని సిబ్బంది రక్షణకు నేవీకి చెందిన యుద్ధనౌకలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

పీ 305 బార్జ్‌లో 273 మంది, జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌ బార్జ్‌లో 137 మంది, సముద్రంలో ఆయిల్‌రిగ్‌లపై పనిచేసే సిబ్బంది తాత్కాలిక నివాసాలున్న ఎస్‌ఎస్‌3 బార్జ్‌లో 196 మంది, ఆయిల్‌ రిగ్‌ సాగర్‌ భూషణ్‌లో 101 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌లోని అందరినీ రక్షించామని, పీ 305 నుంచి 180 మందిని రక్షించామని నేవీ తెలిపింది. ఐఎన్‌ఎస్‌ బియాస్, ఐఎన్‌ఎస్‌ బెట్వా, ఐఎన్‌ఎస్‌ తేజ్, ఐఎన్‌ఎస్‌ కొచి, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌకలు, పలు నేవీ హెలీకాప్టర్లు ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయని తెలిపింది.  

జాడ తెలియని 93 మంది 
ముంబైకి 35 నాటికన్‌ మైళ్ల దూరంలో పీ305 మునిగిపోయిందని నేవీ వెల్లడించింది. ఇందులోని మిగతా 93 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే సముద్రంలో భారీగా ఎగిసిపడుతున్న అలలు, 80–90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, భారీవర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ముందున్న వస్తువులు సరిగా కనపడక సముద్ర జలాల్లో లైఫ్‌జాకెట్ల సహాయంతో తేలుతున్న వారిని గుర్తించడం కష్టమవుతోంది. బార్జ్‌ మునిగిపోయే క్షణం దాకా ఎవరూ కంగారుపడలేదని, అందరం ఒకే దగ్గర సురక్షితంగా ఉన్నామని పీ–305 నుంచి ఆర్మీ రక్షించిన వ్యక్తి చెప్పాడు. ముంబైకి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న హీరా అయిల్‌ఫీల్డ్‌ వద్ద పీ–305 బార్జ్‌ ఉండేది.

‘సోమవారం వేకువజామున అలల ధాటికి లంగరు తెగిపోయి పీ–305 బార్జ్‌ సముద్రంలోకి కొట్టుకుపోయింది. తర్వాత దేనినో గుద్దుకోవడంతో బార్జ్‌కు రంధ్రం ఏర్పడింది. నీళ్లు రావడం మొదలైంది సోమవారం మధ్నాహ్యం 3 గంటల ప్రాంతంలో అందరూ లైఫ్‌ జాకెట్లు వేసుకోవాల్సిందిగా భద్రతా అధికారి చెప్పారు. బార్జ్‌ మునిగిపోతుండటంతో మరోదారి లేక సముద్రంలోకి దూకేశాం. రాత్రంతా నీళ్లలోనే ఉన్నాం. మంగళవారం ఉదయం మమ్మల్ని నేవీ రక్షించింది’ అని ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్‌ నర్వాడ్‌ తెలిపారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో నేవీ చేపట్టిన అత్యంత సవాళ్లతో  కూడిన రెస్క్యూ ఆపరేషన్‌ ఇదేనని వైస్‌ అడ్మిరల్‌ మురళీధరన్‌ సదాశివ్‌ పవార్‌ తెలిపారు.  

నేడు మోదీ గుజరాత్‌ పర్యటన 
టౌటే తుపాను వల్ల దెబ్బతిన్న గుజరాత్, డయ్యూలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తారు. ప్రధాని మోదీ బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ ఎయిర్‌పోర్టులో దిగుతారు. అనంతరం ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా తదితర ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. అనంతరం అహ్మదాబాద్‌లో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top