వారితో జాగ్రత్త.. విజయ్‌కు తమిళిసై హెచ్చరిక | Tamilisai Soundararajan Suggestion To CM Vijay Over Congress | Sakshi
Sakshi News home page

వారితో జాగ్రత్త.. విజయ్‌కు తమిళిసై హెచ్చరిక

May 25 2026 8:04 AM | Updated on May 25 2026 8:34 AM

Tamilisai Soundararajan Suggestion To CM Vijay Over Congress

సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్‌కు అలవాటేనని, జాగ్రత్తగా ఉండాలని సీఎం విజయ్‌కు బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. ఆదివారం చైన్నెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందన్నారు. తమ విజయాల్లో డీఎంకే పాత్ర ఏమీ లేదని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు.

దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం జోసెఫ్‌ విజయ్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్లూ తమతో ఉన్న డీఎంకేకే వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ.. రేపు సీఎం విజయ్‌కు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడదని హెచ్చరించారు.

అన్నాడీఎంకే విషయంలో త్వరలో నిర్ణయం..
మరోవైపు.. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలనే విషయంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆదివారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్‌ ప్రభాకర్‌ స్పందిస్తూ.. రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తనకు వినతిపత్రాలు సమర్పించాయన్నారు.

ఆ వినతిపత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోందన్నారు. తనపై ఆరోపణలు చేసే వారికి కూడా అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో, తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తాననని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుందని స్పీకర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement