హీరో విజయ్ ఏం చ‌దివారో తెలుసా? | Tamil hero Vijay education qualification and assets full details | Sakshi
Sakshi News home page

హీరో విజయ్ విద్యార్హ‌త‌లు ఇవే

Mar 31 2026 2:44 PM | Updated on Mar 31 2026 2:52 PM

Tamil hero Vijay education qualification and assets full details

నామినేషన్‌ దాఖలు చేస్తున్న సినీ నటుడు విజయ్‌

సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయ‌న నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. నామినేషన్‌ పత్రాలను సంబంధిత రిట‌ర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా స‌మ‌ర్పించిన అఫిడవిట్‌లో త‌న‌కు సంబంధించిన ఆస్తులు, వాహ‌నాలు, విద్యా వివ‌రాల‌ను పొందుప‌రిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

విలాసవంతమైన కార్లు, బైకులు
అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం విజయ్‌కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్‌ 350, టొయోటా వెల్‌ఫైర్‌ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్‌లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌(అప్పీల్స్‌), హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.

భార్య పేరిట విడిగా ఆస్తులు
విజయ్‌ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్‌ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్‌ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.

అప్పులు లేవు
తనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్‌ అఫిడవిట్‌లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ ఆనంద్‌కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్‌కు విజయ్‌ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్‌పీ ఆంటోనియస్‌ బ్రిటో, కోకిలాంబల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్‌ ట్రస్ట్‌కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్‌ సంజయ్‌కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

చ‌ద‌వండి: ఎన్నిక‌ల వేళ‌.. విజ‌య్‌కు మ‌రో షాక్‌

డిగ్రీ డిస్‌కంటిన్యూ
విజయ్‌ విద్యార్హ‌త‌ల‌ను గ‌మ‌నిస్తే.. 1989లో పదోతరగతి పాస‌య్యారు. ఆ తర్వాత ప్రైవేట్‌గా ఇంటర్మీడియట్‌ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్‌సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement