ఎన్నికల వేళ.. టీవీకే విజయ్‌కు మరో షాక్‌! | Case filed against TVK chief Vijay for alleged Model Code of Conduct violation | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. టీవీకే విజయ్‌కు మరో షాక్‌!

Mar 31 2026 10:15 AM | Updated on Mar 31 2026 10:28 AM

Case filed against TVK chief Vijay for alleged Model Code of Conduct violation

చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజయ్ 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు కుమార్‌ చెప్పారు.

కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.

పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్‌ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోకు భారీగా జనాలు వచ్చారు. అయితే, చెన్నై పోలీసులపై టీవీకే నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయలేదని అన్నారు.

చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్‌ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్‌కు భద్రత కల్పించలేదని చెప్పింది.

కాగా, విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, త్రిచీ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. ఆయా స్థానాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్‌డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ విజయ్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో 2016 వరకు సీపీఎం ఆధిపత్యం ఉండేది. ఆర్‌డీ శేఖర్ 2019 ఉపఎన్నికలో గెలిచి ఈ స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement