కోవిడ్‌పై పోరులో కీలకం స్వచ్ఛభారత్‌: మోదీ

Swachh Bharat Mission has been a big support to tackle pandemic - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛభారత్‌ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్‌’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

గాంధీజీ చేపట్టిన చంపారన్‌ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన జిల్లాల అధికారులను కోరారు.   కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం నిబంధనలను పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విద్యార్థులను ప్రధాని కోరారు.  

తగ్గిన మరణాలు.. పెరిగిన రికవరీ
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా రెండో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. శనివారం కొత్తగా 61,537 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కు చేరుకుంది. గత 24 గంటల్లో 48,900 కోలుకోగా, 933 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42,518కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,27,005కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,19,088 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.04%కి పడిపోయిందని తెలిపింది.   ఆగస్టు 7 వరక 2,33,87,171 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం మరో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.  

కేంద్రమంత్రి మేఘ్‌వాల్‌కు పాజిటివ్‌
కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌–19 పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని, ఎయిమ్స్‌లో చేరానని ఆయన శనివారం వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా  పరీక్షలు చేయించుకోవాని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top