జంక్‌ఫుడ్‌.. 32 ఆరోగ్య సమస్యలు! | Sakshi
Sakshi News home page

జంక్‌ఫుడ్‌.. 32 ఆరోగ్య సమస్యలు!

Published Fri, Mar 1 2024 10:49 AM

Survey on Junk Food and Its Toxic Effects - Sakshi

జంక్‌ ఫుడ్‌ తింటే అనారోగ్యం...!!
ఊబకాయం వస్తుంది... గుండెజబ్బులకు.. మరెన్నో ఇతర వ్యాధులకూ కారణమవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ... మొత్తం ఎన్ని సమస్యలకు జంక్‌ ఫుడ్‌ కారణమవుతుందన్నది మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు. తాజా అధ్యయనం ఈ కొరతనూ తీర్చేసింది!జంక్‌ ఫుడ్‌తో అక్షరాలా... 30 రకాల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి అంటోంది ఈ అధ్యయనం. వివరాలేమిటో చూసేద్దామా...??? 

ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు, నిపుణుల చెబుతూంటారు. బాగా శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి అందించే తిండి పదార్థాలను జంక్‌ఫుడ్‌ అని పిలుస్తూంటాం మనం. బేకరీ పదార్థాలు, చిరుతిళ్లు, తీపి కలిగినవి, కార్బొనేటెడ్‌ పానీయాలు (కోలా డ్రింక్స్‌), చక్కెర కలిపిన కార్న్‌ఫ్లేక్స్‌ వంటివి, రెడీ టు ఈట్‌ పదార్థాలు.. ఇలా జంక్‌ ఫుడ్‌ జాబితా చాలా పొడవుగానే ఉంటుంది. సౌకర్యం కోసమో.. తీపిపై ఉండే ఆకర్శణ కారణంగానో కొన్ని దశాబ్దాలుగా మనిషి ఈ జంక్‌ఫుడ్‌కు బాగా దగ్గరయ్యాడు. ఆరోగ్య సమస్యలూ అంతే స్థాయిలో మనకు పెరుగుతూ పోయాయి. ఈ సమస్య గురించి చాలామందికి తెలిసినప్పటికీ పూర్తిస్థాయి అవగాహన తక్కువ మందికే ఉంది. 

ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొందరు జంక్‌ఫుడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలను స్థూల స్థాయిలో అర్థం చేసుకునేందుకు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇప్పటికే జరిగిన దాదాపు 45 మెటా అనాలసిస్‌ (అధ్యయనాల) వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ మెటా అనాలసిస్‌లన్నీ గత మూడేళ్లలో ప్రఖ్యాత పరిశోధన జర్నళ్లలో ప్రచురితమైనవే.

ఈ పద్ధతి కారణంగా దాదాపు కోటి మంది జంక్‌ఫుడ్‌ అలవాట్లు, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యల వివరాలు తెలిశాయి. జంక్‌ఫుడ్‌కు ఆరోగ్య సమస్యకు ఉన్న సంబంధానికి చూపిన సాక్ష్యాలను కూడా నిశితంగా విశ్లేషించారు. మూడు వర్గాలుగా విభజించారు. ఎక్కువ అవకాశం ఉండటం, ఓ మోస్తరు.. సాక్ష్యాలు లేకపోవడం అన్నమాట. మొత్తమ్మీద చూస్తే జంక్‌ఫుడ్‌ ఎంత ఎక్కువ తింటున్న వారికి రాగల ఆరోగ్య సమస్యలు కనీసం 32 వరకూ ఉన్నట్లు స్పష్టమైంది. కేన్సర్‌, మరణం, మానసిక, ఊపిరితిత్తుల, గుండె, జీర్ణకోశ, జీవక్రియల సంబంధిత ఆరోగ్య సమస్యలన్నింటికీ జంక్‌ఫుడ్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇంకా...

  • గుండెజబ్బులతో మరణించే అవకాశం 50 శాతం ఎక్కువ.-యాంగ్జైటీ తదితర మానసిక సమస్యలు వచ్చేందుకు 48 నుంచి 53 శాతం అవకాశం.
  • టైప్‌-2 మధుమేహం బారిన పడేందుకు కనీసం 12 శాతం అవకాశం.
  • ఏ కారణం చేతనైనా మరణం సంభవించేందుకు 21 శాతం వరకూ అధిక అవకాశాలు ఉన్నాయి. 
  • ఊబకాయం, నిద్రలేమి, గుండె జబ్బులతో మరణం వంటివాటికి 40 నుంచి 60 శాతం అవకాశాలున్నట్లు స్పష్టమైంది. 
  • ఉబ్బసం, జీర్ణకోశ సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, మంచి కొలెస్ట్రాల్‌ మోతాదు తక్కువగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలకు జంక్‌ఫుడ్‌కు మధ్య సంబంధానికి సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement