
లేకపోతే సెక్షన్ 420 వర్తించదు
నంద్యాలకు చెందిన విద్యాసంస్థ అధినేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: మోసం (చీటింగ్) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నకిలీ (ఫోర్జరీ) పత్రాలను సమర్పించినప్పటికీ, కేవలం ఆ పత్రాల వల్లే ఎదుటి వ్యక్తి మోసపోయి, దానిద్వారా నిందితుడు ఏదైనా భౌతిక ప్రయోజనం పొందితేనే ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫోర్జరీ పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య ప్రత్యక్ష సంబంధం (ప్రేరేపణ) లేనప్పుడు దానిని మోసంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కళాశాల గుర్తింపు కోసం నకిలీ ఫైర్ ఎన్‌వోసీ సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యాసంస్థ అధినేత జూపల్లి లక్ష్మీకాంతరెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
అసలు కేసు..: జూపల్లి లక్ష్మీకాంతరెడ్డి జె.వి.ఆర్.ఆర్.ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నంద్యాలలో కళాశాల నిర్వహిస్తున్నారు. కళాశాల గుర్తింపునకు ఆయన విద్యాశాఖకు నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీని సమర్పించారని జిల్లా ఫైర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. ‘చీటింగ్ నేరం రుజువు కావాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఉండాలి.
తప్పుడు పత్రం చూపి ఎదుటివారిని నమ్మించి, మోసపూరితంగా వారిని ప్రేరేపించి, వారినుంచి ఏదైనా ఆస్తిని పొందడం లేదా వారికి నష్టం కలిగించడం జరగాలి..’ అని జస్టిస్ నాగరత్న ధర్మాసనం పేర్కొంది. ‘నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రకారం 15 మీటర్ల లోపు ఎత్తున్న విద్యాసంస్థల భవనాలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చట్టప్రకారం అవసరం లేని ఒక పత్రాన్ని పిటిషనర్ నకిలీది సమర్పించినప్పటికీ, ఆ పత్రం ప్రేరణతో విద్యాశాఖ గుర్తింపు ఇవ్వలేదు.
ఆ ఎన్‌వోసీ లేకపోయినా ఆయనకు చట్టప్రకారమే గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పిటిషనర్‌కు అక్రమ లాభం గానీ, విద్యాశాఖకు నష్టం గానీ జరగలేదు. తప్పుడు పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య బలమైన సంబంధం లేనప్పుడు, చీటింగ్ నేరానికి అవసరమైన కీలకమైన అంశం సంతృప్తి చెందనట్లే..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మోసపూరిత ఉద్దేశం లేనందున ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లు 468, 471 కూడా వర్తించవని చెబుతూ పిటిషనర్‌పై కేసును ధర్మాసనం కొట్టేసింది.