దంపతుల వివాదం.. చిన్నారి కస్టడీపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత్–రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి ఆదేశాలను తాము ఇవ్వాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి తమ చిన్నారి సహా దొంగచాటుగా సొంత దేశం రష్యా వెళ్లిపోయిన మహిళ జాడ కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్న వేళ ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం పేర్కొంది.
ఈ అంశాన్ని విదేశాంగ శాఖ అక్టోబర్ 17వ తేదీన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రష్యా మహిళ తప్పించుకుపోవడంపై నేపాల్‌కు చెందిన వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు. నేపాల్, యూఏఈల మీదుగా ఆ మహిళ సొంత దేశం వెళ్లేందుకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ అధికారులు సాయపడినట్లు ధర్మాసనం గుర్తించింది.
ఈ విషయంలో రష్యా అధికారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినా సరైన ఫలితం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య సంబంధాలను దెబ్బతీసే ఏ ఉత్తర్వునూ మేం ఇవ్వదలుచుకోలేదు. కానీ, ఇది ఒక బిడ్డకు సంబంధించిన విషయం. తల్లితో ఉన్న ఆ చిన్నారి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడని మాత్రమే మేం ఆశించగలం. ఇది మానవ అక్రమ రవాణా కేసు కాకూడదని ఆశిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది.
ఈ విషయంలో విదేశాంగ శాఖ, ఢిల్లీ పోలీసులతో చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం రెండు వారాల గడువిచ్చింది. దేశంలో 2019 నుంచి ఉంటున్న ఆ మహిళ ఎక్స్–1వీసా గడువు ఎప్పుడో తీరిపోయింది. చిన్నారి కస్టడీ కేసు కోర్టులో ఉండటంతో ఎప్పటికప్పుడు వీసా కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చారు. అయితే, ఆమె అధికారుల కళ్లుగప్పి రష్యా వెళ్లిపోయినట్లు గుర్తించారు.
ఆ చిన్నారిని వారంలో మూడు రోజులపాటు తల్లి వద్ద, మిగతా రోజుల్లో తండ్రి కస్టడీలో ఉండేలా మే 22న కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కుమారుడిని తల్లి తన కస్టడీకి అప్పగించలేదని, వారిద్దరి జాడ తెలియడం లేదని తండ్రి కోర్టును ఆశ్రయించగా వెంటనే వారి ఆచూకీ కనుగొనాలని కోర్టు జూలై 17వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే, ఆమె దేశం విడిచి వెళ్లినట్లు జూలై 21వ తేదీన సమాచారమివ్వగా, ఇది తీవ్రమైన ధిక్కరణ అంటూ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే.


