మమతా బెనర్జీ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Supreme Court 25,000 Teachers Big Shock To Mamata Banerjee Govt | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Published Thu, Apr 3 2025 11:51 AM | Last Updated on Thu, Apr 3 2025 1:41 PM

Supreme Court 25,000 Teachers Big Shock To Mamata Banerjee Govt

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. బెంగాల్‌లో 25వేల మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో మమత సర్కార్‌ను భారీ ఎదురుదెబ్బ తగిలింది.

వివరాల ప్రకారం.. బెంగాల్‌లో 2016లో జరిగిన 25వేల టీచర్ల నియామకాలను కలకత్తా హైకోర్టు గతంలో రద్దు చేసింది. టీచర్‌ నియామకాల కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో పలు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

అలాగే, టీచర్‌ నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. అయితే, ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దివ్యాంగ ఉపాధ్యాయులకు మానవతా కోణంలో ఊరట కల్పించింది. వారు విధుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి టీచర్‌ సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement