జైపూర్:రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రయాణిస్తున్న వాహనాలపై డంపర్ ట్రక్ దూసుకెళ్లింది. ఐదుకిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మందికి పైగా మృతి చెందారు. యాబై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 17కు పైగా వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
జైపూర్ నగరంలోని హర్మదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ డంపర్ ట్రక్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన డంపర్ ట్రక్ ముందుగా ఓ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీ కొడుతూ మరో రెండు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు, బైకులు, పాదచారులు అన్నీ డంపర్ ట్రక్ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి. అయినప్పటికీ ట్రక్ డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో డంపర్ డ్రైవర్?
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో డంపర్ డ్రైవర్ మద్యం సేవించినట్లు సమాచారం. ఐదు కిలోమీటర్ల మేర అతను వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘డంపర్ ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. రోడ్డుమీద వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. వాహనాలు ప్రమాదానికి గురవుతున్నా ఆపకుండా ముందుకు వెళ్లాడని ’ వారు పేర్కొన్నారు.
పోలీసుల దర్యాప్తు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డంపర్ డ్రైవర్ మద్యం సేవించాడా? లేక వాహనంలో బ్రేక్ ఫెయిల్యూర్ జరిగిందా? అనే కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.


