లక్నో: అరవై నాలుగు కళల్లో దొంగతనం ఒక కళ అంటారు. అయితే ఈ దొంగతనంలో 64 విధానాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు కొందరు చోరులు. దొంగతనం జరిగిందని గుర్తించేలోగా చోరులు మాయమైపోతుంటారు. యూపీలోని లక్నోలో కొందరు మహిళా చోరులు వింతైన పద్ధతులు నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
నగరంలోని బస్సులు, ఆటోలలో ప్రయాణికుల దృష్టి మరల్చడానికి సదరు మహిళా చోరులు తమకు వికారంగా ఉందని, వాంతులు వచ్చేలా ఉన్నాయంటూ నాటకాలు ఆడుతుంటారు. తరువాత తమ చాతుర్యాన్ని ఉపయోగించి, మహిళల బంగారు ఆభరణాలను తస్కరిస్తుంటారు. తాజాగా ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల మహిళా ముఠాను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మహిళా దొంగలు బస్సు, లేదా ఆటో ఎక్కాక వాంతులు వేసుకున్నట్లు నటిస్తూ, తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురిచేస్తారు. తరువాత వారి పరధ్యానాన్ని గుర్తించి, వారి బంగారు ఆభరణాలను దొంగిలించి, పారిపోతుంటారని పోలీసులు తెలిపారు.
తూర్పు డీసీపీ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, ముఠాలోని ఒక సభ్యురాలు.. ప్రయాణ సమయంలో తొలుత పక్కన్నున్నవారిని మాటల్లోకి దింపుతారు. మరొకరు వాంతి వస్తున్నట్లు నటిస్తూ, తమ దగ్గరున్న పాలిథిన్ బ్యాగ్‌లో వాంతి చేసుకుంటారు. ఈ చర్యతో తోటి ప్రయాణికులు వారిని అసహ్యించుకొని, వారికి కొంచెం దూరం జరుగుతారు. ఇదే తగిన సమయంగా భావించి దొంగల ముఠా సభ్యులు ఆభరణాలను చోరీ చేస్తారు. తరువాత వారంతా మెల్లగా జారుకుంటారని శశాంక్ సింగ్ తెలిపారు. ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా వారిని పట్టుకున్నామన్నారు. వీరి నుంచి మూడు బంగారు గొలుసులు, ఒక బంగారు లాకెట్, ఒక ముత్యాల హారం, రూ. 13 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు.
ఇది కూడా చదవండి: ‘కూటమిలో పప్పు, తప్పు, అప్పు’: సీఎం యోగి


