దర్భంగా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం బీహార్‌లోని దర్భంగాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, ఆర్జేడీల పనితీరును దుయ్యబట్టారు. వారి పాలనలో రాష్ట్రంలో ఏమి జరిగిందో గుర్తు చేశారు.
ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టిన సీఎం యోగి.. వారి గత పాలనలో పేదలకు ప్రాథమిక అవసరాలు, సంక్షేమ ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆరోపించారు. 2005కి ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలోని పేదలు అనారోగ్యానికి గురైతే, వైద్య సదుపాయాలు లేక బాధపడుతూ చనిపోయేవారని అన్నారు. మహాత్మాగాంధీ చెప్పిన మూడు కోతులు కథను గుర్తు చేస్తూ, నేడు ఇండియా కూటమిలో పప్పు, తప్పు, అప్పు అనే మూడు కొత్త కోతులు ఉన్నాయన్నారు. వాటి గుణాలను వివరిస్తూ పప్పు నిజం మాట్లాడలేడని, తప్పు సరైనది చూడలేడని, అప్పు నిజం వినలేడని అన్నారు. ఈ నేతలు ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను చూడలేరు, వినలేరు, మాట్లాడలేరని, అందుకే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని యోగి ఆరోపించారు.
కశ్మీర్‌ను కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందని, అయితే ప్రధాని మోదీ దానిని ఉగ్రవాదం నుండి విముక్తి చేశారని సీఎం యోగి పేర్కొన్నారు. హిందువులు కశ్మీర్‌ను విడిచి వెళ్లాల్సి రావడం వెనుక కాంగ్రెస్ తప్పిదముందని, ఇప్పుడు మిథిల, బీహార్ ప్రజలు కూడా అక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు రామునికి వ్యతిరేకం అని, హిందూ విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నాయని సీఎం ఆరోపించారు.
రామ రథయాత్రను ఆపేందుకు ఆర్జేడీ ప్రయత్నించిందని, అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరపాలని సమాజ్ వాదీ పార్టీ ఆదేశించిందని, పవిత్ర నగరాన్ని రక్తంతో ఎర్రగా మార్చారని యోగి ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో బీహార్‌లో 70కి పైగా మారణహోమాలు జరిగాయన్నారు. ఈ పార్టీలు ప్రజలను కులాల వారీగా విభజించి, జాతీయ భద్రతను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం


