- వెనిజులా తీరప్రాంతాల్లో అమెరికా నౌకాదళం బుల్లెట్లు
- వెనిజులా కోసం ఇప్పటికే రాడార్‌లను సిద్ధం చేసిన రష్యా
- ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ బలగాలు
- 1999 నుంచే రెండు దేశాల మధ్య యుద్ధం
- వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించేందుకు పుతిన్ అంగీకారం
- ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసిన రష్యా
- లాటిన్ అమెరికా అంతటా ఆందోళన
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్‌కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్‌లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్‌మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రం
ఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది.

దశాబ్దాల క్రితమే..
నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్‌ను వెనుజులా ప్రెసిడెంట్‌గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.
సరిహద్దు సముద్రంలో పేలుళ్లు
ఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్‌వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.
అమెరికా ఆధిపత్యానికి సవాలు
ఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్‌తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.


