
న్యూఢిల్లీ: రాజధాని రీజియన్‌లోని జనావాసాల నుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.
👉జంతు పరిపరక్షణ విభాగాల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. ‘‘వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్ హోమ్స్ లేవు. అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ ఉంచుతారు?. పోనీ ఒకవేళ ఒకే దగ్గర అన్నేసి కుక్కలను ఉంచితే.. అవి తిండి కోసమో లేదంటే మరేయితర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు.. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా.. గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు. మరో సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదెలా ఉందంటే.. గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లు ఉంది. అలాగని వీధికుక్కల దాడులు.. కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవనే పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదు’’ అని వాదించారు.
👉ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధికుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్ (సంతానరహిత క్రియ) అనేది రేబిస్‌ను ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి.
పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని.. అమ్మాయిలు తిరగలేని పరిస్థితి. దీనిపై వివాదం కాదు.. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశం’’ అని వాదించారు.
👉అయితే.. సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు జనాల్లోకి చేరకముందే.. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. ‘‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, కానీ వాటిని అమలు చేయదు. Animal Birth Control (ABC) నిబంధనలు అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది’’ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈరెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులపై అత్యవసర స్టే అవసరమా? అనే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం చెబుతూ.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఆదేశం ఇలా..
వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది.
అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.