పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్ | Stand Unchanged: India Stays Firm On Indus Waters Amid Pak Threats | Sakshi
Sakshi News home page

పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్

Jul 3 2026 9:31 PM | Updated on Jul 3 2026 9:31 PM

Stand Unchanged: India Stays Firm On Indus Waters Amid Pak Threats

ఢిల్లీ: పాక్‌ బెదిరింపుల వేళ.. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని పాకిస్థాన్‌‍కు భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. పొరుగు దేశం.. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని.. నీళ్లను ఆయుధంగా మార్చవద్దంటూ పాకిస్థాన్‌ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను భారత్‌  తిప్పికొట్టింది.

గత ఏడాది (2025) ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తోంది. సరిహద్దు నదులను పంచుకునే ఇతర దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నేడు పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు ఏదీ మారదని తేల్చిచెప్పింది.

సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. పాకిస్తాన్ నిరంతరం సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడింది. పాకిస్తాన్ నమ్మదగిన విధంగా శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలంటూ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదానికి సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్, సింధు జలాల విషయంలో తానే తవ్వుకున్న గోతిలో పడి విలవిలలాడుతోందని.. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న ఈ దేశం, ఇప్పటికీ భారత్‌పై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌పై దాడులు చేయడానికి ఉగ్రవాదులకు తన భూభాగాన్ని వాడుకునేలా అనుమతిస్తూనే ఉంది’’ అంటూ రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్‌, సట్లెజ్‌ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్‌ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్‌.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement