శ్రీనగర్: భారీ ఉగ్రదాడి కుట్రను జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీనగర్ పోలీసులు కోనఖాన్‌లోని మమతా చౌక్ సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న సాయుధులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.
‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక నల్లని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపాలంటూ సిగ్నల్ ఇవ్వగానే, రైడర్‌తో పాటు మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అనుమానితులను షా ముతైబ్, కమ్రాన్ హసన్ షా,మొహమ్మద్ నదీమ్‌గా గుర్తించారు. వీరంతా ఖన్యార్‌లోని కావా మొహల్లాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కంట్రీ-మేడ్ పిస్టల్, తొమ్మిది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఒక ప్రణాళిక ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడేవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖన్యార్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఆయుధ చట్టం, యూఏపీఏ అండ్ మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఉగ్ర దాడికి కుట్ర పన్నారని తేలింది. అనుమానితుల నెట్‌వర్క్‌ను కనుగొనేందుకు పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనగర్ పోలీసుల అప్రమత్తత కారణంగా భారీ ఉగ్రదాడి తప్పిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దరిమిలా కొంతకాలం వెనుకకు తగ్గిన ఉగ్రవాదులు.. ఇప్పుడు తిరిగి సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పని ఒత్తిడి: 10 మందిని చంపిన నర్స్


