బెర్లిన్: ఎవరికైనా సరే విపరీతమైన పని ఒత్తిడి అనేది ఆందోళనకు దారితీస్తుంది. అది ఇంకా అధికమైతే మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. ఇటువంటి సమయంలో ఒత్తిడి బాధితులు తమ మనసుపై అదుపును కోల్పోతారు. అప్పుడు విపరీత పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇటువంటిదే జర్మనీలోని ఒక మేల్ నర్స్ విషయంలో జరిగింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
పశ్చిమ జర్మనీలోని కోర్టు ఒక మేల్ నర్స్ చేసిన దారుణాలకు శిక్ష విధించింది. అతను పనిచేస్తున్న ఆస్పత్రిలో 10 మంది రోగులను హత్య చేయడానికి తోడు మరో 27 మందిని చంపేందుకు ప్రయత్నించాడు. సదరు మేల్ నర్స్ చేసిన ఘాతుకాలు రుజువు కావడంతో ‘పాలియేటివ్ కేర్’ నర్స్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పేరు వెల్లడికాని ఆ నర్స్ నిత్యం రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవాడు. తన పనిభారపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు అతను తన పర్యవేక్షణలో ఉన్న వృద్ధ రోగులకు మార్ఫిన్ లేదా మత్తుమందులను ఇంజెక్ట్ చేశాడు. ఈ నేరం రుజువైన దరిమిలా అతను దోషిగా తేలాడు. ఈ హత్యలు 2023, డిసెంబర్- 2024, మే మధ్య పశ్చిమ జర్మనీలోని వుర్సెలెన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో చోటుచేసుకున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్స్.. నిత్యం సంరక్షణ అవసరమయ్యే రోగుల విషయంలో సానుభూతి చూపలేదని, బాధితుల జీవితానికి, మరణానికి యజమానిగా ప్రవర్తించాడని ప్రాసిక్యూటర్లు ఆచెన్ కోర్టుకు తెలిపారు. ‘ఎఎఫ్‌పీ’ తెలిపిన వివరాల ప్రకారం అతను సాగించిన నేరాలు.. ఇప్పటివరకూ గుర్తించిన వాటికన్నా అధికంగానే ఉండవచ్చని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని మృతదేహాలను వెలికితీసి, పరీక్షలకు పంపించనున్నారు. అలాగే దోషిని తిరిగి విచారించే అవకాశం కూడా ఉంది.
ఆ మేల్ నర్స్ 2007లో నర్సింగ్ శిక్షణ పూర్తి చేశాక 2020లో వుర్సెలెన్‌లోని ఒక ఆస్పత్రిలో చేరాడు. రాత్రిపూట షిఫ్ట్‌లలో ఉన్నప్పుడు అతను రోగుల మరణాలను వేగవంతం చేయడానికి,తన పనిభారాన్ని తగ్గించుకునేందుకు బాధితులకు అధిక మోతాదులో మార్ఫిన్, మిడాజోలం అనే మత్తు మందులను ఇచ్చాడనే ఆరోపణలున్నాయి. కాగా అతని చర్యలు అత్యంత తీవ్రమైనవని కోర్టు అతనికి శిక్ష విధించే సమయంలో పేర్కొంది. ఫలితంగా అతను 15 ఏళ్ల కన్నా ముందుగా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే దోషికి ఇప్పటికీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు ఉంది.
ఇది కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్


