ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన | snake Like bridge Construction In Bhopal Video Viral | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన

Jul 5 2025 10:49 AM | Updated on Jul 5 2025 11:14 AM

snake Like bridge Construction In Bhopal Video Viral

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్‌లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్‌, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.

వివరాల ప్రకారం.. భోపాల్‌లోని సుభాష్‌నగర్‌లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్‌ నగర్‌ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్‌ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్‌ స్టేషన్‌, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్‌లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement