
అక్టోబర్ 7కల్లా పూర్తి: సీఎం
బెంగళూరు: కర్నాటకలో సెప్టెంబర్ 22 నుంచి రాష్ట్ర కులగణన మొదలుకానుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అక్టోబర్ 7వ తేదీ వరకు ఇది పూర్తి కానుందన్నారు. దీని కోసం సుమారు రూ.420 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వేగా పిలిచే ఈ సర్వేకు కర్నాటక రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ చైర్‌పర్సన్ మధుసూదన్ ఆర్ నాయక్ సారథ్యం వహించనున్నారన్నారు.
ఇందులో శాస్త్రీయంగా రూపొందించిన 60 ప్రశ్నలతో రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది ప్రజలు, 2 కోట్ల కుటుంబాల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులను తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ కల్లా సర్వే నివేదిక అందే అవకాశాలున్నాయన్నారు. దసరా సెలవుల్లో సుమారు 1.75 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సర్వేను చేపడతారన్నారు. ఇందుకోసం శిక్షణ ఇస్తున్నారని, ఒక్కొక్కరికి 120–150 ఇళ్ల బాధ్యతలు అప్పగిస్తారని సీఎం చెప్పారు. వీరికి రూ.20 వేల పారితోషికం కూడా ఇస్తామన్నారు.