భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు!

Senior congress leaders and Politicians condole demise of Stan Swamy - Sakshi

భారతీయుడిగా విచారిస్తున్నా: శశి థరూర్‌

ఈ హత్యకు ఎవరు బాధ్యులు

నోరెత్తితే టెర్రరిస్టులంటున్నారు : కపిల్‌ సిబల్‌

సాక్షి,ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ  ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు  ఫాదర్‌ స్టాన్‌ స్వామి (84) కన్నుమూయడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఫాదర్‌ స్టాన్‌ స్వామి  అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని  లోటని పలువురు  రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు  తమ సంతాపం తెలిపారు.

ప్రధానంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ స్వామి మరణంపై విచారం వ్యక‍్తం చేశారు.  ఆయన న్యాయానికి, మానవత్వానికి అర్హుడు అంటూ స్టాన్‌ మృతిపై సంతాపం తెలిపారు.  స్వామి మరణం విచారకరం. గొప్ప మానవతావాది,  దేవుడిలాంటి ఆయన పట్ల  ప్రభుత్వం  అమానుషంగా ప్రవర్తించింది. ఒక  భారతీయుగా చాలా బాధపడుతున్నానంటూ కాంగ్రెస్‌ ఎంపీ,సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?నిర్దోషిని, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించిన స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని జయరాం రమేష్‌  వ్యాఖ్యానించారు. స్వామి మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో అత్యంత అణగారినవారి కోసం జీవితాంతంపోరాడిన వ్యక్తి కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరమని ట్విట్‌ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం తీరని అపఖ్యాతికి గురవుతోందన్నారు.

ఇంకా జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ‍్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్ , సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ  తదితరులు ట్విటర్‌ ద్వారా స్వామి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యశాలి, ఉద్యమకారుడు స్వామికి మరణం లేదని, ఆయన తమ హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటారని దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ  ట్వీట్‌ చేశారు. ఆ మహామనిషి  రక్తంతో తమ చేతులను తడుపుకున్న మోదీ షాలను జాతి ఎప్పటికీ విస్మరించదంటూ మండిపడ్డారు. దారుణ ఉపా చట్టం ఆయనను బలి తీసుకుంది. త‍్వరలో విచారణ మొదలు కానుందనే ఆశ విఫలం కావడంతో న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ మూగబోయారంటూ ప్రముఖ న్యాయవాది కబిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు. నోరెత్తిన వారినందరినీ  "ఉగ్రవాదులు" గా ప్రభుత్వం ముద్ర  వేస్తోందంటూ  ఘాటుగా విమర్శించారు.

కాగా కరోనా బారిన పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా ఉదయం కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 84 ఏళ్ల వయసులో పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూ స్థిరంగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్న స్వామిని జైల్లో నిర్బంధించి, బెయిల్‌ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుందని బీజేపీ సర్కార్‌పై పలువురు సామాజిక సంఘ నేతలు మండిపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top