అందుకేనా!.. ముషారఫ్‌ రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంది: బీజేపీ

BJP Critisize Musharraf Wanted To See Rahul Gandhi As PM - Sakshi

పాక్‌ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్‌ ముషారఫ్‌ మృతికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముషారఫ్‌ శాంతి కోసం శత్రువుగా మారిన నిజమైన శక్తి అని ఆయన అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా శశిథరూర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బాలాకోట్‌ దాడులను అనుమానించి సొంత ఆర్మీ చీఫ్‌ని గూండాగా పిలిచిన ఘనత కాం‍గ్రెస్‌కే దక్కుతుంది ఫైర్ అయ్యారు. పైగా ముషారఫ్‌పై తెగ అభిమానం కురిపిస్తోందంటూ ధ్వజమెత్తారు.

ముషారఫ్‌​ ఒకప్పుడు భారతదేశానికి నిష్కళంకమైన శత్రువు కానీ 2002 నుంచి 2007 మధ్య శాంతికి నిజమైన శక్తిగా మారాడని శశిథరూర్‌ ట్విట్టర్‌లో అన్నారు. ఆ రోజుల్లో తాను యూఎన్‌లో ఉండగా ఏటా అతన్ని కలుసుకునేవాడినని చెప్పారు. అతను వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వ్యవహరించేవాడని పేర్కొన్నారు. దీంతో షెహజాద్‌ ఒసామా బిన్‌ లాడెన్‌, తాలిబాన్‌లను ప్రశంసించే ముషారఫ్‌ రాహుల్‌ గాంధీని కూడా ప్రసంసించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. కార్గిల్‌ యుద్ధానికి కారకుడు, ఉగ్రవాదానికి మద్దతుదారుడు అయిన ముషారఫ్‌ని ప్రశంసించడానికి బహుశా అదేనా కారణం అంటూ విరుచుకుపడ్డారు.

2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ముషారఫ్‌ రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలను షెహజాద్‌ ప్రస్తావించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. అంతేగాదు నిజాయితీగా చెప్పాలంటే.. భారత్‌ లేదా పాకిస్తాన్‌ కోసమో కాదు. నిజంగా శాంతి కావాలంటే మోదీ సాబ్‌ వద్దు అని అన్నారు. అలాగే తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీకి వెళ్లినప్పుడూ.. రాహుల్‌ గాంధీ తన కొడుకుని టీ తాగడానికి ఆహ్వానించారని చెప్పారు. అలాగే మన్మోహన్‌ సింగ్‌ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించారని అన్నారు. తాను భారత్‌తో క్రికెట్‌ని ప్రోత్సహించేవాడినని, దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచే వాటిని తాను ప్రోత్సహిస్తానని ముషారఫ్‌ చెప్పుకొచ్చారు. కాగా అమిలోయిడోసిస్‌తో బాధపడుతున్న ముషారఫ్‌ దుబాయ్‌ ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

(చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top