‘దివ్యాంగుల చట్టం’ అమలుపై  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు  | SCI Notice On PIL Seeking Stronger Enforcement Of Disability Rights Law | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగుల చట్టం’ అమలుపై  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు 

Jun 2 2026 4:26 AM | Updated on Jun 2 2026 4:26 AM

SCI Notice On PIL Seeking Stronger Enforcement Of Disability Rights Law

సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల హక్కుల చట్టం–2016 దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చట్టం తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని శశాంక్‌ పాండే అనే లాయర్‌ వేసిన పిల్‌పై సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం తెచ్చిన ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పించలేదని తెలిపారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కమీషన్లు, బోర్డులు చురుగ్గా పనిచేయడం లేదని తెలిపారు. అధికార యంత్రాంగం మెజారిటీ కేసుల్లో వికలాంగుల కమిషన్ల సిఫార్సులను అమలు చేయడం లేదు. అలా అమలు చేయకపోవడానికి గల కారణాలను కూడా వారు సమర్పించడం లేదని పిటిషన్‌ పేర్కొన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. దివ్యాంగుల హక్కుల కోసం చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

చట్టం కేవలం కాగితాలకే పరిమితం కారాదని, అప్పుడే దివ్యాంగుల జీవితాల్లో ఆచరణాత్మక మార్పులు వస్తాయని అభిప్రాయపడింది. సమాజంలో వారికి అవరోధాలు లేని వాతావరణం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ వాజ్యంపై స్పందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు, రిజర్వేషన్ల అమలు, ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి స్పందన అందిన తర్వాత తదుపరి విచారణ చేపడతామంటూ ధర్మాసనం కేసును వాయిదా వేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement